కారు దిగడానికి రె'ఢీ'

by S Gopi |   ( Updated:2022-12-04 02:33:22.0  )
కారు దిగడానికి రెఢీ
X

దిశ, ఖమ్మం బ్యూరో: మాస్ లీడర్ పొంగులేటి కారు దిగనున్నారా..? కొత్త కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా భరించిన శ్రీనివాస్‌రెడ్డి ఈసారి పక్కా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. అయితే కాంగ్రెసా..? బీజేపీనా..? అనే కొంత సందిగ్ధత ఉన్నా.. పక్కా కమలం కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. కొంతకాలంగా పార్టీ మారుతారని ప్రచారం జరిగినా.. ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ మారాలని ఆయన అనుచరులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. పొంగులేటి సైతం తన రాజకీయ భవిష్యత్ కోసం ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని అమలు పరిచే సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా సమాచారం. వచ్చే డిసెంబర్ లేదా జనవరి నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కాగా కమలం కండువా కప్పుకుంటారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం.

డిసెంబర్ లేదా జనవరిలో..

వాస్తవానికి పొంగులేటి ఎప్పటినుంచో పార్టీ మారాలంటూ ఆయన అనుచరులు, ముఖ్యనేతలు ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ మారి ఉమ్మడి జిల్లాలో తమ సత్తా ఏంటో చూపాలంటూ సూచించారు. ఇన్నాళ్లూ శ్రీనివాసరెడ్డి సైతం తనకు జరిగిన అవమానాలను తట్టుకోలేక పార్టీ మారేందుకు సిద్ధమయినట్లు ఎన్నో ప్రచారాలు జరిగాయి. తన కుమార్తె వివాహం అనంతరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ ఊహించారు. తర్వాత మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్ అన్నారు. అయితే పొంగులేటి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన అభిమానులు కార్యకర్తల్లో నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఎన్నికలు తరుణం ఆసన్నమైతున్నందున నిర్ణయం తీసుకోక తప్పదనే భావనకు వచ్చిన పొంగులేటి.. డిసెంబర్ లేదా జనవరిలో కచ్చితంగా పార్టీ మారుతారని తెలుస్తున్నది.

బీజేపీ, కాంగ్రెస్ వల..

టీఆర్ఎస్‌ను వీడి పొంగులేటి వేరే పార్టీలోకి కచ్చితంగా వెళ్తారని గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే వాటిని మాత్రం పొంగులేటి ఖండించినప్పటికీ.. అప్పట్లో తమ పార్టీలోకి పొంగులేటి రావడం ఖరారైందని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెప్పారు. బీజేపీ సైతం అప్పట్లో శీనన్న కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకానొక సందర్భంగా ఢిల్లీ పెద్దలు సైతం ఆయనకు, ఆయన ముఖ్య అనుచరులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇక కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలుందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.. పొంగులేటి భవిష్యత్ నిర్ణయం ఎలా ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పొంగులేటిని తమ పార్టీల్లోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయనేది వాస్తవం. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ఎదుగుతున్న క్రమంలో బీజేపీలో చేరితేనే తనకు తన అనుచరులకు భవిష్యత్ ఉంటుందని భావించి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

పదవిలేకున్నా జనాల్లోనే..

శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ఇమేజ్.. పది నియోజకవర్గాల్లో పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు.. ఈ నేపథ్యంలో పదవి నుంచి దూరమైనప్పటికీ పొంగులేటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా జనాల్లోనే ఉంటున్నారు. అనేక కార్యక్రమాలకు హాజరవుతూ కార్యకర్తలను, అభిమానులు పలకరిస్తున్నారు. ఇటీవల ఆయన కుమార్తె వివాహం వైభవంగా చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా రాత్రి పగలూ తేడా లేకుండా మండపాలకు తిరుగుతూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోటా చదివింపులు చేస్తూ అందరినోళ్లలో నానుతున్నారు. దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు అందజేస్తున్నారు.

టీఆర్ఎస్ కు భారీ నష్టమే..

పొంగులేటి జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి నేత పార్టీకి దూరమైతే అది టీఆర్ఎస్ కు భారీ కుదుపు అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీలోకి వెళ్తే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉంటున్న పెద్ద తలకాయల కోసం గాలం వేస్తున్న సంగతి తెలిసిందే.. ఒకవేళ పొంగులేటి పార్టీ వీడితే మరి కొన్ని జిల్లాల నుంచి భారీగా టీఆర్ఎస్ కు రాజీనామా చేసే కీలక నేతల సంఖ్య పెరుగుతుందని తెలుస్తున్నది.


Also Read....

లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పైనా ఆరోపణలు.. నేడు సీఎం కౌంటర్ ఇస్తారా?

Advertisement

Next Story

Most Viewed