పూసుకుంటను రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

by Sumithra |
పూసుకుంటను రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
X

దిశ, దమ్మపేట : పూసుకుంట గ్రామాన్ని రోల్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని అధికారులకు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న పూసుకుంట గ్రామాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీవో, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ, చేనేత, అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా పూసుకుంట గ్రామ అభివృద్ధి పై సుమారు గంటకు పైగా పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల ప్రజలతో, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వెంటనే పూసుకుంట గ్రామానికి రాసన్నగూడెం వయా కట్కూర్ మీదగా పూసుకుంటకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అటవీ శాఖ నుండి ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ఉన్నత అధికారులతో మాట్లాడతానని పుసుకుంటకు రహదారి నిర్మించాల్సిందేనని తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో, పూసుకుంట గ్రామ ప్రజలతో మమేకమై అధికారులు రేపటి నుంచే పనులు ప్రారంభించాలని అన్నారు. పూసుకుంటుకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా అక్కడి ప్రజల్లో మార్పు తీసుకురాగలుగుతామన్నారు.

రహదారి నిర్మాణంతో పాటు ఇక్కడ ప్రజలకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాలని, రైతులకు కావలసిన బోర్లు, మోటర్లు, విద్యుత్ సదుపాయాలు అందించాలని అధికారులకు తెలిపారు. పూసుకుంట గ్రామంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలని, పిల్లలను చదివించడం ద్వారా, కుటుంబాలు బాగుపడతాయని, చదువుకొని కుటుంబంలో ఒకరు ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబ తలరాతే మారిపోతుందని, విద్యతోనే సామాజిక మార్పు తీసుకురాగలుగుతామని అన్నారు. ఐటీడీఏ ద్వారా పూసుకుంటకు స్పెషల్ అధికారిని నియమించి నూతన వ్యవసాయ పద్ధతులు నేర్పించాలని ఆదేశించారు. పోడు భూముల్లో ఫలసాయం వచ్చే పంటలు వేయించాలని, గ్రామస్తులు ఎవరూ కూడా పోడు నరకవద్దని తెలిపారు. జనవరి లోపల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవ్వాలని, మళ్లీ వచ్చే నెలలో పూసుకుంట గ్రామాన్ని సందర్శిస్తానని, గ్రామంలోని ప్రజలు ఏది అడిగితే అది చేయాలని, పూసుకుంటకు ప్రత్యేక ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓకు తెలిపారు. పూసుకుంట గ్రామం పై అన్ని శాఖల జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో పూసుకుంట ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పూసుకుంట గ్రామ ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తెలిపారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత పూసుకుంట గ్రామానికి వచ్చానని తెలుపుతూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story