డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.. మంత్రి తుమ్మల

by Sumithra |
డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.. మంత్రి తుమ్మల
X

దిశ, దమ్మపేట : డైట్ కాస్మోటిక్ చార్జీల పెంపుతో రాష్ట్రంలో గురుకులాలతో పాటుగా బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, అనుబంధ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏపీఓ రాహుల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 16 ఏళ్ల తర్వాత డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచారని అన్నారు. రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతోనే విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు 500 కోట్లు నిధులు కేటాయించి పెంచామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవాలని కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ద్వారా కుటుంబాల్లో మార్పు తీసుకురాగలుగుతామని, కుటుంబంలో కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబ తలరాతే మారుతుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు దీటుగా రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు ఉండాలనేదే తన కోరిక అని, లక్షల రూపాయలు వెచ్చించి చదువుకునే వారి కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలని విద్యార్థులను కోరారు. అనంతరం ఏకలవ్య పాఠశాలలోని స్టోర్ రూమ్లను, వంటశాలలను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed