నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం

by Sridhar Babu |
నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం
X

దిశ, ఖమ్మం : ఖమ్మం పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం రాపర్తి నగర్ 58వ డివిజన్ లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. కోటి 10 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 58వ డివిజన్ పెద్దదని, కొత్త కాలనీలు, ఇంటి నిర్మాణాలు చేపడుతున్నందున అవసరమైన రోడ్లు, డ్రైన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దొరైకాలనీలో మౌలిక వసతుల కల్పన కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామని, వీటిని స్థానిక అవసరాలకు వినియోగించాలని సూచించారు.

ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ముందు పనులు చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. నగరంలోని ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి భూమి లెవెలింగ్ చేసి నీరు నిల్వకుండా చూడాలని కోరారు. ఖమ్మం నగర అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరు తుమ్మల అని, ఖమ్మంలో ఎక్కడ ఏం చేయాలో సంపూర్ణ అవగాహన ఉన్న నాయకులని అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ రూ. 100 కోట్ల అభివృద్ధి నిధుల్లో 58వ డివిజన్ పనులకు రూ. కోటి 10 లక్షలు మంజూరు అయ్యాయని, వర్క్ ఆర్డర్ ఇచ్చామని, రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని, 2 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కమర్తపు మురళి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సీహెచ్. స్వామి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story