సత్తుపల్లిలో హై టెన్షన్ వాతావరణం..

by Sumithra |
సత్తుపల్లిలో హై టెన్షన్ వాతావరణం..
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గత రెండు రోజులుగా జరుగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గత రెండు రోజుల క్రితం శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మాధురి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం అభినందన సభలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సభా వేదిక పై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు. సత్తుపల్లిలో డీ టాక్స్ పేరుతో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.

ఈ విమర్శలు సంధించడంతో శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదే చెన్నకేశవరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాదె చెన్నకేశవరావు మాట్లాడుతూ సత్తుపల్లిలో గత 15 ఏళ్లుగా అవినీతిని పెంచి పోషించింది మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అని అన్నారు. పేకాట, కోడి పందాల, జూదం, ఆటలను ఏర్పాటు చేసి కమిషన్ దండుకున్న సంస్కృతి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో డీ టాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు ఎక్కడ ఎంత వసూలుకు పాల్పడినారని నిరూపించాలని అన్నారు.

ఆదివారం ఉదయం 9 గంటలకు సత్తుపల్లి బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని సవాల్ విసరటంతో సోషల్ మీడియా వేదికగా సవాళ్లు ప్రతి సవాళ్లు హల్చల్ కావడంతో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా కల్లూరు ఏసీపీ ఏ.రఘు, పట్టణ సీఐ టీ.కిరణ్, రూరల్ సీఐ ముత్తు లింగం ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేంసూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పదులు సంఖ్యలో ముఖ్యనాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో సత్తుపల్లిలో ఏ క్షణం ఏం జరుగుతుందని ప్రజల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.


Next Story

Most Viewed