కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి

by Sridhar Babu |
కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
X

దిశ, ముదిగొండ : ముదిగొండ మండలం సువర్ణపురం రెవెన్యూ పరిధిలోని న్యూ లక్ష్మీపురం గ్రామ సమీపంలోని సర్వేనెంబర్ 417 లో ఎకరంన్నర ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఆ భూమి విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న కొంతమంది వ్యక్తులు దర్జాగా ఆక్రమించి అందులో ఫామ్ హౌస్ నిర్మించారు. సొంత భూమిలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ నుండి అనుమతులు తీసుకొని, రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి తప్ప ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి అనుమతులు ఉండవు.

అలాంటిది ఏకంగా సదరు వ్యక్తి ఫామ్ హౌస్ ని నిర్మించి దర్జాగా ఆక్రమించుకున్నాడు. మరో అడుగు ముందుకేసి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేశారు. అయినా స్థానిక అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా దీని పక్కనే ఉన్న మరొక వ్యక్తి కూడా కొంత ఆక్రమించి వెంచర్ నిర్మాణం చేశారు. ఆ భూమి వెంకటగిరి టు వల్లభి ప్రధాన రహదారి పక్కన ఉండడంతో దానిపై అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వ భూమిని కలుపుకొని వెంచర్ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా ఇచ్చారు అని పలువురు విమర్శిస్తున్నారు. వీరు భూమిని కలుపుకొని ఏకంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story