Bonala festival : స్మార్ట్ కిడ్జ్ లో వేడుకగా బోనాల సంబురాలు..

by Sumithra |   ( Updated:2024-07-27 11:16:08.0  )
Bonala festival : స్మార్ట్ కిడ్జ్ లో వేడుకగా బోనాల సంబురాలు..
X

దిశ, ఖమ్మం : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన బోనాల సంబురాన్ని స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం వేడుకగా నిర్వహించారు. కొత్త బోనాల మట్టి కుండలో నైవేద్యాన్ని వండి బోనాల కుండ పై ప్రమిదను ఉంచి బోనాల కుండలతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. బృందాలుగా బోనాలతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు బోనాలు నెత్తిన పెట్టుకొని పురవీధులలో ప్రదర్శనగా అమ్మవారి గుడి వద్దకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు పోతురాజు వేషధారణలో ప్రత్యేక అలంకరణతో చేతిలో చండ్రకోల పట్టుకొని బోనాల ప్రదర్శనకు ముందు నడిచారు. సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఉన్న విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయినీలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ప్రత్యేకంగా సెట్టింగ్ లో అమ్మవారిని ఉంచి చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బోనాల మొక్కలు చెల్లించారు. బోనాలు నెత్తిన పెట్టుకున్న ఉపాధ్యాయినీలు ప్రదర్శనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించారు.


ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బోనాల సంబురాలలో పాఠశాల విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని బోనాల వేడుకలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే తెలంగాణ బోనాల వేడుకకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పాఠశాల విద్యార్థులకు తెలియజేసేందుకే పాఠశాలలో బోనాల వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలు తదితర తెలంగాణ ప్రత్యేక పర్వదినాలను జరుపుతున్నామని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. తరతరాలుగా మన రాష్ట్ర సంస్కృతిలో భాగమైన బోనాల వేడుకల సాంప్రదాయాన్ని కొత్తతరం కూడా విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు మన రాష్ట్ర ప్రత్యేక సంబురాలు గురించి తమ పిల్లలకు తెలియజేసి సాంప్రదాయాల నిర్వహణలో భాగస్వాములు అయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed