శుభ్రతపై మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన

by Sridhar Babu |
శుభ్రతపై మధ్యాహ్న భోజన వర్కర్లకు అవగాహన
X

దిశ, కొత్తగూడెం : జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం కొత్తగూడెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి అధ్యక్షతన ఆనందఖనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్న భోజనం వంట చేసే గ్రూప్ సభ్యులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలని కోరారు. వంట చేసే ముందు కాళ్లు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని, తలకు టోపీ ధరించి పరిశుభ్రమైన వాతావరణంలో మాత్రమే భోజనం వండాలని సూచించారు. పాఠశాలకు వచ్చిన బియ్యం ముందుగానే శుభ్రపరుచుకుని డబ్బాలో పోసుకోవాలని, మంచి నీటితో మాత్రమే వంట చేయాలని ఆదేశించారు.

ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. వంటకు ఉపయోగించే కూరగాయలు సాధారణంగా మునగాకు, కరివేపాకు, చింతాకు స్వయంగా పండించినదైతే చాలా మేలని, పిల్లలకు బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. బయట షాప్ ల ద్వారా తీసుకువచ్చే కూరగాయలు శుభ్రమైన నీటితో కడగాలని, అందులో పుచ్చులు, పురుగులు లేకుండా జాగ్రత్తగా చూసి వండాలని, పిల్లలకేదైనా అనర్ధం జరిగితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆరోగ్యం బాగోలేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి భోజనం అందించాల్సిన అవసరం ఉంటేనే పెట్టాలని, లేకుంటే ఉపాధ్యాయులకు విషయం తెలియపరిచి ఇంటికి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎం.వెంకటేశ్వర చారి, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, FAO శ్రీనివాస్, కొత్తగూడెం మండల విద్యాధికారి ఎం. ప్రభుదయాళ్, చుంచుపల్లి మండల విద్యాధికారి బి.బాలాజీ, పి.కృష్ణయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story