Wyra Khammam District : వైరా నియోజకవర్గ బీజేపీలో మరో మలుపు..

by Hamsa |   ( Updated:2023-01-30 05:35:38.0  )
Wyra  Khammam District : వైరా నియోజకవర్గ బీజేపీలో మరో మలుపు..
X

దిశ, వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వైరా నియోజకవర్గం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఇప్పటివరకు ప్రధాన పార్టీలో టికెట్ల కోసం నెలకొన్న పోటీ నియోజకవర్గంలో ప్రస్తుతం నామ మాత్రంగా వున్న బీజేపీ పార్టీను తాకింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తుండటంతో ఆయన త్వరలో బీజేపీలో చేరుతారని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. అయితే పొంగులేటి వైరా నియోజకవర్గo నుంచి తన అభ్యర్థిగా బానోత్ విజయభాయి ని ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. విజయ భాయి గతంలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీపీఐ పార్టీకి గుడ్ బై కూడా చెప్పారు. ఇలాంటి తరుణంలో వైరా బీజేపీ సీటు కోసం బీజేవైఎం జిల్లా ఇంచార్జ్ కట్రావత్ మోహన్ నాయక్ పోటీ పడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైరా సీటును ఆశిస్తున్న మోహన్ నాయక్ త్వరలో వైరా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం రాజకీయ సర్కిలలో సంచలనంగా మారింది. గత 8 నెలల క్రితం వైరా సీటు ఆశించి ఇక్కడికి వచ్చిన మోహన్ నాయక్ నాలుగు నెలల పాటు నియోజకవర్గంలో హడావుడి చేశారు. ఆ తర్వాత గత 4 నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరగటం.. పొంగులేటి తరుపున వైరా అభ్యర్థిగా విజయ బాయిని ఎంపిక చేశారని స్పష్టం కావడంతో మోహన్ నాయక్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ అయ్యేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనే వైరా నియోజకవర్గ రాజకీయాల్లో లేటెస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

అసలు కాట్రావత్ మోహన్ నాయక్ ఎవరు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అంతరంగికుడు పేరుతో గత 8 నెలల క్రితం మోహన్ నాయక్ వైరా రాజకీయాల్లోకి వచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుఫాన్ కుద్ గ్రామానికి చెందిన మోహన్ నాయక్ బండి సంజయ్ పేరుతో వైరాలో నాలుగు నెలల పాటు విస్తృతంగా పర్యటించారు. అంతేకాకుండా కొంతమంది నిరుపేదలకు ఆర్థిక సాయం చేశారు. అదే సమయంలో వైరా మండలం గొల్లపూడి గ్రామంలో పులిగుట్ట ఫై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో తన సొంత నిధులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసే యాగశాల, దేవాలయం కు వెళ్లేందుకు మెట్లు, కొంత దూరం రోడ్డు నిర్మించారు. ఈ దేవాలయంలో సుదర్శన యాగం నిర్వహించేందుకు 2022 ఆగస్టు నెలలో ఏర్పాట్లు చేశారు. అయితే అధికార పార్టీ నేతలకు, మోహన్ నాయక్ మధ్య ఈ యాగం సందర్భంగా వివాదం నెలకొంది. ఈ యాగంలో ప్రోటోకాల్ రగడ నెలకొనటంతో అర్ధాంతరంగా ఈ యాగం ఆగిపోయింది. అనంతరం గత 4 నెలలుగా ఆయన వైరాకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చేస్తానని ప్రకటించి వైరా బీజేపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.

ఈ మేరకు బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల్లో 'మోహన్ అన్న పాదయాత్ర' పేరుతో పోస్టింగులు పెట్టారు. ఫిబ్రవరి 20వ తేదీన గొల్లపూడి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచే తన పాదయాత్రను ప్రారంభిస్తానని మోహన్ నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుమతి తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా మోహన్ నాయక్ పాదయాత్ర అంశం కూడా వైరా పొలిటికల్ సర్కిల్లో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తుంది.

Advertisement

Next Story