ప్రజలతో కనెక్షన్ కట్.. అధికారం నుంచి ఔట్.. BRS ఓటమికి ఇదే ఒక కారణమే..?

by Satheesh |
ప్రజలతో కనెక్షన్ కట్.. అధికారం నుంచి ఔట్.. BRS ఓటమికి ఇదే ఒక కారణమే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమం సమయంలో ప్రజలను, ప్రజా సంఘాలను అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు. సప్త సముద్రాలైనా దాటొచ్చేమోగానీ ప్రగతి భవన్‌లోకి వెళ్ళి ఆయనను కలవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు అనే అభిప్రాయం ఏర్పడింది. ప్రజలకే కాదు.. మంత్రులకూ అదే అభిప్రాయం ఉన్నది. నిత్యం పొగిడే, అత్యంత సన్నిహితంగా ఉండే హోం మంత్రి మహమూద్ ఆలీ మొదలు అనేక మంది మంత్రులకు ప్రగతి భవన్‌లో పలుమార్లు ఎంట్రీ దొరకలేదు. లోపలి నుంచి కబురు వస్తే మాత్రమే అనుమతి ఉండేది. ఇక సామాన్యుల సంగతి సరేసరి. కేసీఆర్ నుంచి పిలుపు లేనివారికి గేట్లు తెరుచుకోవు. గద్దర్ సైతం మూడు గంటల పాటు ఎండలో నిరీక్షించి తిరిగి వెళ్ళిపోయారు.

ప్రగతి భవన్‌లో ప్రజలను కలవడానికి, సమావేశం కావడానికి ‘జనహిత’ పేరుతో ఒక బ్లాక్ ఉన్నప్పటికీ అది అరుదైన సందర్భాల్లోనే తెరుచుకునేది. ‘పెద్దాయన ప్రజలను కలవరు.. కలవాలనుకున్న ప్రజలకు ఆయన దొరకడు..’ అనేది జనంలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అనే ధోరణిని ఒంట బట్టించుకున్న ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలదీ అదే దారి. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో కలవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు అన్ని సెగ్మెంట్లలో ఉన్నా అవి అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సంబంధం కట్ అయింది.

అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే వైఖరి చివరకు వారి మెడకు చుట్టుకున్నది. పదేళ్ళ పాటు సహనంలో ఉన్న ప్రజలు ఎట్టకేలకు ఓట్ల రూపంలో నిర్ణయం తీసుకున్నారు. ఆడింది ఆటగా.. నడిచిన ఎమ్మెల్యేల పనితీరు చివరికు వారి పదవికే ఎసరు పెట్టింది. సమస్యలను పరిష్కరించడానికి ఎన్నుకున్నా వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలకే మేలు చేసుకుంటున్నారనేది కళ్లారా చూసిన ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోయారు. అహంకార ధోరణి, అధికార బలంతో విర్రవీగే ఆ పార్టీ నేతలకు ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు కసి తీర్చుకున్నారు. మాకొద్దీ ఈ పాలన.. అంటూ పార్టీకి, ఎమ్మెల్యే అభ్యర్థులకు వీడ్కోలు పలికారు. అధికారాన్ని కత్తిరించారు. మార్పునకే జై కొట్టారు.

Advertisement

Next Story

Most Viewed