వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఎం కేసీఆర్

by GSrikanth |
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్, ఇతర అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థికసాయం.. తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నేటి సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లా పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలనిస్పష్టం చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలన్నారు.

ఖాళీ జాగలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో... అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా? అనే అంశానికి సంబంధించి సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు.. పాస్ బుక్కులు ముద్రించి సిద్ధంగా వున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్ధంగా వున్నాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30 న భధ్రాచలంలో జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా, భద్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో, దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కళ్యాణ నిర్వహణకోసం నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనిధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story