కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది మస్టర్ కోసమే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్

by Ramesh Goud |
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది మస్టర్ కోసమే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ (KCR) అసెంబ్లీకి వచ్చింది మస్టర్ కోసమే కానీ ప్రజల కోసం కాదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) ఎద్దేవా చేశారు. గురువారం ఏకగ్రీవం అయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో గాంధీభవన్ (Gandhi Bhavan) లో టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి మాట్లాడుతూ.. స్టేచర్ గురించి మాట్లాడే స్థాయి నియంతలకు ఉంటుందని, హిట్లర్ కూడా స్టేచర్ గురించే మాట్లాడి, అబద్దాలను ప్రచారం చేయడానికి మంత్రినే పెట్టాడని, కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

స్పీకర్ పట్ల, రాజ్యాంగం పట్ల, సభ పట్ల కనీస గౌరవం లేని నాయకులను తయారు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అని మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడినం ఏం చేసినా నడుస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని, కానీ అసలు కొట్లాడిన వాళ్లం ఇక్కడే ఉన్నామని విజయశాంతి ని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశం కోసం త్యాగం చేసిన పార్టీ అని, బీఆర్ఎస్ నాయకుల త్యాగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. సోనియా గాంధీ కాళ్లు మొక్కితే ఇచ్చిన తెలంగాణకు సీఎం అయిన మీరు స్టేచర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. స్టేచర్ గురించి మాట్లాడినోడు స్ట్రెచర్ మీదికి అటునుంచి మార్చురీకి వెళతారని నిన్న ముఖ్యమంత్రి అన్నారని, హిట్లర్ కు అదే జరిగిందని చెప్పారు.

పార్టీ పేరులో తెలంగాణ తీసేసి, భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్న దద్దమ్మలు బీఆర్ఎస్ వాళ్లని, వాళ్లకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ ప్రజలు నీ లాంటి నియంతలను తొక్కి, రేవంత్ రెడ్డిని సీఎం చేశారని, తెలంగాణ సమాజం ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టిందో ఆత్మ పరీశీలన చేసుకోవాలని సూచించారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు.. ఇవాళ స్పీకర్ గా ఒక దళితుడు ఉండటాన్ని ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన సేవలను గుర్తించి పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అమరవీరులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని అద్దంకి స్పష్టం చేశారు.

Next Story