KC Venugopal: అమాత్యులకు క్లాస్ పీకిన కేసీ వేణుగోపాల్.. తీరు మార్చుకోవాలని హితవు

by Shiva |
KC Venugopal: అమాత్యులకు క్లాస్ పీకిన కేసీ వేణుగోపాల్.. తీరు మార్చుకోవాలని హితవు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రులపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం సహా మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించిన మీటింగ్‌లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులను చదివి వినిపించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదని.. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది.

రిపోర్టు ఆధారంగా క్లాస్..

ప్రభుత్వం, మంత్రుల పనితీరుపై ఏఐసీసీ తన సొంత సోర్సెస్ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలిసింది. ఆ రిపోర్టు ఆధారంగా ఒక్కో మంత్రి పనితీరుపై కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదని, పార్టీ ఎజెండాను పక్కన పెట్టి, ప్రత్యేక ఎజెండాతోనే పనిచేస్తున్నారని సీరియస్ అయినట్టు సమాచా రం. సొంత సామ్రాజ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించడంతోపాటు సీరియస్‌గా కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టాక్.

ప్రైవేటు కంపెనీ నడుపుతున్నారా?

సమావేశంలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ‘ప్రభుత్వం నడుపుతున్నారా? లేక ప్రైవేటు కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపుల విషయంలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు సంబంధించిన శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నట్టు ఓ మంత్రి ఫిర్యాదు చేయగా, తన సొంత జిల్లాకు చెందిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ పక్క జిల్లాకు చెందిన లీడర్లు పెత్తనం సాగిస్తున్నారంటూ మరో మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

సీఎంపై విమర్శలా?

సీఎం రేవంత్‌రెడ్డిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మెజార్టీ మంత్రులు ఖండించేందుకు ముందుకు రాకపోవడాన్ని కేసీ వేణుగోపాల్ ప్రస్తావించినట్టు టాక్. సీఎంకు ఎందుకు సపోర్టుగా ఉండటం లేదని నిలదీసినట్టు తెలిసింది. ఓ మంత్రి బహిరంగంగానే సీఎంపై కామెంట్స్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతి సరికాదని అందరి ముందే సదరు మినిస్టర్‌ను హెచ్చరించినట్టు సమాచారం. ఎవరికి వారే అన్నట్టుగా మంత్రులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్టు టాక్. మెజార్టీ మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని సీరియస్ అయినట్టు తెలిసింది. ఏడాది కాలంలో చాలా మంది మంత్రుల వ్యవహారశైలీలో చాలా మార్పు వచ్చిందని.. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన కార్యకర్తలను కలిసేందుకు ఎందుకు టైమ్ ఇవ్వడం లేదని నిలదీసినట్టు తెలిసింది. ‘కార్యకర్తలను పట్టించుకోండి. వాళ్లను రెగ్యులర్‌గా మీట్ అవ్వండి. మంత్రి పదవి రాగానే కార్యకర్తలను మర్చిపోవద్దు. వాళ్లే పార్టీకి ముఖ్యం. వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి’ అని స్పష్టం చేసినట్టు సమాచారం.

సంక్షేమం విషయంలో వెనుకబడొద్దు!

పార్టీ కేడర్, ప్రభుత్వం మధ్య సమన్వయం తీసుకురావాలని మినిస్టర్లకు కేసీ సూచించినట్టు తెలిసింది. ఈ రెండింటి మధ్య సమన్వయం కోసం మంత్రులు జిల్లా పర్యటనలో కేడర్‌తో మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వెనకబడట్టు చెప్పిన ఆయన.. ఇప్పటి నుంచి ఆ లోటు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసినట్టు టాక్.

Next Story

Most Viewed