లిక్కర్ స్కాం దృష్టి మళ్లించేందుకే కవిత దీక్ష డ్రామా: ఇందిరా శోభన్

by Hamsa |   ( Updated:2023-03-02 14:39:59.0  )
లిక్కర్ స్కాం దృష్టి మళ్లించేందుకే కవిత దీక్ష డ్రామా: ఇందిరా శోభన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : లిక్కర్ స్కాం నుంచి దృష్టిని మరల్చేందుకు ఎమ్మెల్సీ కవిత ఢీల్లీ జంతర్ మంతర్‌‌లో దీక్ష డ్రామా చేయబోతున్నారని తెలంగాణ ఉద్యమకారురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. లిక్కర్ స్కాం లో త్వరలో జైలుకు పోయే అవకాశం ఉండడంతో ఆకస్మాత్తుగా మహిళలు గుర్తుకు రావడం విచిత్రంగా ఉందన్నారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయ డ్రామా, అధికార యావ తప్ప వేరే ఏమీ లేదని గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా మహిళల హక్కుల కోసం గళమెత్తిన దాఖలాలే లేవని, ఇన్నేళ్ల తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కవిత దీక్షకు చేపడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఎంపీగా ఉండి ఒక్కనాడు కూడా దీనిపై స్పందించలేదన్నారు.

పోరాటం చేయాల్సిన సమయంలో పోరాడకుండా నేడు మహిళల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి ఎంత మంది మహిళలు పంపారు ఎంతమంది మంత్రులు చేశారు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది మహిళలు అవమానాలు హత్యలు, అత్యాచారాలు దాడులకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, దాడులు జరిగినప్పుడు కనీసం మాట్లాడలేదని, చర్యలు కూడా తీసుకోలేదని నిలదీశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాల్సిందేనని అయితే జనాభాలో సగభాగమున్న మహిళలకు 33 శాతం కాకుండా 50 శాతం రిజర్వేషన్లు కావాలని దాని కోసం పోరాడాలని సూచించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి చట్టం చేయకుండానే మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారని ఆ విధంగా మీరు మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా జాగృతి సంస్థ నుంచి ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed