MLA KTR : మేడిగడ్డ నీటితో ప్రాజెక్టులు నింపకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం..

by Sumithra |
MLA KTR : మేడిగడ్డ నీటితో ప్రాజెక్టులు నింపకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం..
X

దిశ, తిమ్మాపూర్ : మెడిగడ్డ ప్రాజెక్టులో ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని, ఈ వచ్చిన నీటిని పంపింగ్ చేసి దాని పరిధిలోని అన్ని ప్రాజెక్టులను నింపాలని లేనిపక్షంలో రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. గురువారం ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో కలిసి తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామని అన్నారు. గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా పంట పొలాలను ప్రాజెక్టులను ఎండబెట్టారని విమర్శించారు. మెడిగడ్డ వద్ద ఏర్పడిన చిన్న లోపాన్ని సాకుగా చూపి ఈ ప్రాజెక్టు ఒక విపలయత్నంగా చూపే ప్రయత్నం చేశారని అన్నారు.

కాళేశ్వరం నుంచి ప్రతిరోజు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృధా పోతున్న లిఫ్టు చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవీగా నిలబడి ఉందని అన్నారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఫణంగా పెట్టి పంట పొలాలను ఎండబెడుతున్నారని విమర్శించారు. ఎల్ఎండి, అన్నపూర్ణ రిజర్వాయర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే రైతులులో భరోసా ఏర్పడుతుందని అన్నారు. నీరు ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపకుండా రేపు వర్షం పడలేదనే సాకు చూపెడతారని అనిపిస్తోందని అన్నారు. కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే రిజర్వాయర్లు అన్ని నిండుతాయని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సారెస్పీలో 90 టీఎంసీల గాను కేవలం 24 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు.

ఎల్ఎండి, మిడ్ మానేరులో కేవలం ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రాజెక్టులు నింపితే రైతులు హర్షం వ్యక్తం చేస్తారని అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపితే రైతుల అవసరాలతో పాటు హైదరాబాదు సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు.

ప్రస్తుతం మేడిగడ్డలో నీళ్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు మేడిపండు అని, లక్షల కోట్లు కొట్టుకుపోయాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివేనని తేలాయని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను పరిశీలించి ఎండుతున్న ప్రాజెక్టులు, మండుతున్న రైతుల గుండెల బాధలను శాసనసభలో ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



Next Story