Police Department : తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించిన ముగ్గురు అరెస్ట్..

by Sumithra |
Police Department : తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించిన ముగ్గురు అరెస్ట్..
X

దిశ, కరీంనగర్ రూరల్ : తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమిని ఆక్రమించిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారణ్యపురికి చెందిన మూల ప్రభాకర్ రెడ్డి అతని అనుచరులైన, వల్లంపహాడ్ కి చెందిన జోముకుంట మల్లయ్య, తీగలగుట్టపల్లికి చెందిన పెరుకరి శ్రీనివాస్ లను గురువారం అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చెడె రాధికకు, తన తల్లి భూపతి రాజమణి కొనుగోలు చేసిన కరీంనగర్ లోని వల్లంపహాడ్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 145 లో 200 గజాల ఇంటి స్థలాన్ని బహుమతిగా తన కూతురైన రాధిక పేరిట 2013 వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు. అట్టి స్థలంలో రాధిక ఇంటి నిర్మాణం చేయదలచి వెళ్లి చూడగా అప్పటికే తమ ఇంటి స్థలంతో పాటు దాదాపు ఇంకా 30 గుంటల స్థలం చుట్టు ప్రహరీ గోడతో పాటు ఒక రూమ్ సైతం నిర్మించి ఉందని బాధితురాలు తెలిపింది.

ఇట్టి నిర్మాణం ఎవరు చేశారని తెలుసుకోగా మూల ప్రభాకర్ రెడ్డి , పెరుకరి శ్రీనివాస్, జోముకుంట మల్లయ్యలు చేసారని తెలిసిందని, తనకి తగిన న్యాయం చేయాలని బాధితురాలు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బాధితురాలి తల్లి అయిన భూపతి రాజమణి ఇట్టి స్థలాన్ని శ్రీ ప్రియ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసిందని, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని దాదాపు 15 ఎకరాల 22 గుంటల స్థలాన్ని వెంచర్ గా 1993 నుండి 1996 వరకు ఎన్ హెచ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఓపెన్ ప్లాట్ లుగా అభివృద్ధి పరిచి పలువురికి విక్రయించాడని, ఆ ప్లాట్ లను విక్రయించుటకు గాను కొంతమందిని ఆ భూములకు సంబంధించిన యజమానులనే ప్లాట్ విక్రయ ఏజెంట్లుగా నియమించుకున్నాడని అన్నారు.

అందులో జోముకుంట మల్లయ్య కూడా ఒక పట్టేదారు కాగా, మూల ప్రభాకర్ రెడ్డిలు ఇరువురు ఏజెంట్ లుగా కూడా పనిచేశారని అన్నారు. ఆ సమయంలో అట్టి భూముల అమ్మకాలు , కొనుగోళ్లలో లోపాలను గ్రహించిన వీరు తప్పుడు అగ్రిమెంట్ లు చేసి , సరైన హాద్దులు చూపించకుండా మొదలు ఎన్ హెచ్ భాస్కర్ రెడ్డి కి జి .పి .ఏ. ద్వారా రిజిస్ట్రేషన్ చేసి అట్టి భూమిలో ప్లాట్ లుగా చేసి పలువురికి విక్రయించారని తెలిసినప్పటికీ, తరువాత అప్పటికే చేసిన అగ్రిమెంట్ లను మోసపూరితంగా దురుద్దేశంతో నిలిపివేసి తిరిగి మూల ప్రభాకర్ రెడ్డి, జోముకుంట మల్లయ్యలు వారి బంధువుల పేరిట సేల్ రిజిస్ట్రేషన్ లు చేసి అట్టి భూములను ఆక్రమించారని తేలిందన్నారు. నిందితుల ముగ్గురిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను కరీంగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ కోర్ట్ లో హాజరు పరచగా, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా నిందితులను జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed