ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా

by Sridhar Babu |
ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా
X

దిశ, వేములవాడ : మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శనివారం వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన 19 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధితో రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 800 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నేటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్ఓసీలు సుమారు రూ. 10 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆనాడు మీ కష్టాల్లో పాలు పంచుకొని ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి సంకేపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ఆనాడు ఇక్కడి సమస్యల పరిష్కారానికి పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి వంటి వారు అండగా ఉన్నారని గుర్తు చేశారు. గత నేల 20 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ వచ్చిన సందర్భంగా ప్రజలకు 4696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని, రానున్న రోజుల్లో పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ముంపు గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న 3600 దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

కంటతడి పెట్టిన కనకయ్య

ఇదిలా ఉండగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను వివరిస్తూ ఆనాడు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. కనకయ్య కన్నీటిని చూసిన అక్కడున్నవారు సైతం తీవ్ర కంటతడి పెట్టారు. ఇది గమనించిన విప్ ఆది శ్రీనివాస్ వారిని ఓదార్చి తప్పకుండా అందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story