‘రుణమాఫీ’ సందడి షురూ..! రైతులతో కిటకిటలాడుతున్న బ్యాంకులు

by Shiva |
‘రుణమాఫీ’ సందడి షురూ..! రైతులతో కిటకిటలాడుతున్న బ్యాంకులు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీపై రైతుల్లో ఆత్రుత నెలకొన్నది. రుణ మాఫీ డబ్బులు తమ ఖాతాల్లో పడ్డాయా లేదా అనే విషయం నిర్ధారించుకునేందుకు రైతులు బ్యాంకుల బాట పట్టారు. తమ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు పడ్డాయా అంటూ బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఇలా రైతులు రుణమాఫీ డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకులకు వెళ్తుండడంతో బ్యాంకులన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి విడుతగా రూ.లక్ష వరకు ప్రభుత్వం రుణ మాఫీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బు జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో రైతుల్లో తమ ఖాతాలో డబ్బు జమయ్యాయా.. లేదా.. అనే ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టంగా చెప్తున్నప్పటికీ రైతుల్లోఆత్రుత మాత్రం తగ్గడం లేదు. రుణమాఫీ జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ రైతులు తమ ఖాతాలో డబ్బు జమయ్యాయా లేదా అని బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తున్నారు. దీంతో బ్యాంకులు అన్ని రైతులతో సందడిగా మారాయి. సారూ నా రుణమాఫీ డబ్బులు వచ్చాయా అంటూ ఆరా తీస్తూ వచ్చిన వారు మళ్లీ రుణం తీసుకోవాలి అంటే ఎలా అని వాకబు చేస్తున్నారు.

రచ్చబండ ముచ్చట్లు..

గ్రామాల్లోని రచ్చబండలన్నీ రైతు రుణమాఫీ ముచ్చట్లతోనే సాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏ రచ్చబండ కాడ నలుగురు కలసినా రైతు రుణమాఫీ ముచ్చటే వస్తుంది. మన గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ వచ్చింది, డబ్బులు ఖాతాలో పడ్డాయా లేదా, వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు, బ్యాంకుకు వెళ్లి తెలుసుకున్నారా? మళ్లి క్రాప్ లోన్ ఇస్తున్నారా? బ్యాంకు అధికారులు ఏమైనా తిరకాసు పెడుతున్నారా అనే సందేహాలతో రచ్చ బండలన్నీ చిన్నపాటి అసెంబ్లీని తలపిస్తున్నాయి.

రూ.2 లక్షల లోపు రుణమాఫీ..

రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రతి సందర్బంలో స్పష్టంగా చెబుతున్నప్పటికీ కొంతమంది రైతుల్లో రుణమాఫీపై సందేహం వీడడం లేదు. రెండు లక్షలలోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఆగస్టు 15లోపు ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నప్పటికీ మొదటి విడతలో కొన్ని టెక్నికల్ సమస్యలతో జాబితాలో పేరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏదైనా టెక్నికల్ సమస్య లేదా ఇతర కారణం చేత రుణమాఫీ జాబితాలో పేరు లేక పోయినా వారికి కూడా రుణమాఫీ వస్తుందని జిల్లాకు వచ్చిన సందర్బంలో రెవెన్యూశాఖ మంత్రి స్పష్టం చేశారు. కాగా రూ.లక్షలోపు రుణమాఫీని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేయడంతో రైతులు బ్యాంకుల్లో ఆరా తీస్తు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, రూ.రెండు లక్షలలోపు ప్రతి రైతుకు రుణమాఫీ వస్తుందని స్పష్టం చేస్తుంది.

Advertisement

Next Story