ప్రచారం ముసుగులో ప్రలోభాలు..

by Sumithra |
ప్రచారం ముసుగులో ప్రలోభాలు..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఎన్నికల ప్రచారం ముసుగులో జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పలురాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా వారికి డబ్బు, మద్యాన్ని ఆశగా చూపుతున్నారు. గ్రామస్థాయిలో ఉండే పలుమహిళా సంఘాల ఆర్పీల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలియ వచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా పెన్షనర్లకు గాలం వేసే పనిలో సదరు మహిళా సంఘాల ఆర్పీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాదని ఈ రకమైన ప్లాన్ కు సదరు రాజకీయ పార్టీలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పోలింగ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికే ఆయా పట్టణాలు, గ్రామాలలో డంప్ చేసిన డబ్బును ఓటర్లకు పంచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఓవైపు అధికారులు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తుంటే పలు పార్టీల లీడర్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంపిణీ చేసి ఓటుకు నోటు అన్నచందాన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎన్నికల అధికారులు..

ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వారిని కస్టడీలోకి తీసుకొని ఐపీసీ 171 ప్రకారం బ్రైబరీ కింద కేసులునమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారిని తగిన ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకు రావాల్సిందిగా తెలిపారు. ఎన్నికలకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సీ విజిల్ యాప్ ద్వారా సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Advertisement

Next Story