Shankarpally: కోతులతో పరేషాన్.. వానరాలతో నిత్యం వార్

by Ramesh Goud |
Shankarpally: కోతులతో పరేషాన్.. వానరాలతో నిత్యం వార్
X

ఓవైపు వనాల నిర్మూలన.. మరోవైపు గుట్టల విధ్వంసం, బాంబుల మోతలతో బండరాళ్ల చప్పుడుకు అదిరిపోయి వానరాలు అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాలను చేరి స్వైర విహారం చేస్తున్నాయి. పల్లెలను వాటి ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇండ్లపైన చేరి ఇంటి పైకప్పులను, నీటి ట్యాంకులను పాడు చేస్తున్నాయి. ఇక మండల పరిధిలో ఉన్న గుట్టలన్నీ గ్రానైట్ కంపెనీలు గుల్ల చేస్తున్నాయి. దీంతో వాటిని ఆవాసంగా చేసుకుని జీవించే మూగ జీవాలు వనం వీడి జనంలోకి వస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా ఏ వాడలో చూసినా కోళ్ల మందలను తలపించేలా కోతుల గుంపులు ఎదురు పడుతున్నాయి. గుంపులుగా సంచరిస్తూ వాటిలో అవి తగులాడుకుంటూ మనుషులపైనా దాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలు. కోతి కరిచిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాక పంట చేన్లలో పడి పంటలను ఆగమాగం చేస్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

దిశ, శంకరపట్నం : ఓవైపు వనాల నిర్మూలన.. మరోవైపు గుట్టల విధ్వంసం, బాంబుల మోతలతో బండరాళ్ల చప్పుడుకు అదిరిపోయి వానరాలు అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల్లోని నివాస ప్రాంతాల్లోకి చేరి స్వైర విహారం చేస్తున్నాయి. పల్లెలను వాటి ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇండ్లపైన చేరి ఇంటి పైకప్పులను నీటి ట్యాంకులను పాడు చేస్తున్నాయి. ఇక మండల పరిధిలో ఉన్న గుట్టలన్నీ గ్రానైట్ కంపెనీలు గుల్ల చేస్తున్నాయి. ఒకప్పుడు మూగ జీవాలు గుట్టలు, చెట్లను ఆవాసంగా చేసుకుని జీవించేవి. వాటి ఆవాసాలను విధ్వంసం చేయడంతో వనం వీడి జనంలోకి చేరుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా ఏ వాడలో చూసినా కోళ్ల మందలను తలపించేలా కోతుల గుంపులు ఎదురు పడుతున్నాయి. మందలు మందలుగా సంచరిస్తూ వాటిలో అవి తగులాడుకుంటూ మనుషులపైన దాడి చేసిన సంఘటనలు కోకొల్లలు. కోతి కరిచిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలో చొరబడి సరుకులను ఎత్తుకెళ్లడంతో ఆహార పదార్థాలను దాచి పెట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పంటలు ఆగమాగం..

ఇక వ్యవసాయదారుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు కోతిని చూడాలంటే కొండగట్టు వెళ్లాల్సి ఉండేది. అక్కడ ఏపుగా పెరిగిన ఆ చెట్ల మధ్యలో కోతులు ఎప్పుడో ఓసారి కనిపించేవి. లేదా సర్కస్ ఆటగాళ్లు తీసుకొచ్చే కోతిని చూసి ఆనందంలో మునిగి తేలేవారు. కానీ నేడు మండల వ్యాప్తంగా వానరాల సంచారంతో పల్లె జనాలు పరేషాన్ అవుతున్నారు. మండలంలో ఉన్న పలువురు రైతులు వేరుశెనగ, కొత్తిమీర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి సాగు చేస్తే వాటిని కోతులు చీల్చి చెండాడుతూ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. దీంతో పల్లెవాసులు కూరగాయల సాగు, ఆరు తడి పంటలను సాగు చేయాలంటే జంకుతున్నారు. కరీంపేట గ్రామానికి చెందిన రైతు చింతిరెడ్డి మల్లారెడ్డి రెండు ఎకరాల్లో వేరుశనగ విత్తుకోగా చేను కోతకు వచ్చే దశలోనే విపరీతంగా వచ్చిన కోతులకు జడిసి పంట చేనును వదిలేసుకున్నాడు. దీంతో ఆ రైతు దాదాపు రూ.30 వేల నుంచి రూ.40వేలు నష్టపోయినట్లు తెలిపాడు. మరో పక్క కూరగాయలను సాగు చేసే రైతుల బాధలు వర్ణనాతీతం. పూత దశ నుంచి కాయ దశకు చేరుకునే లోపే కోతుల మందలు చేల్లల్లో చేరి కాయలను కొరికి వేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా వస్తున్న కోతులతో గ్రామీణులు బెంబేలెత్తుతున్నారు. పంటల తీరు వానర సైన్యంతో పూర్తిగా మారిపోతుంది. దీంతో కేవలం రైతులు వరి పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పంటల అసమతౌల్యం ఏర్పడి కూరగాయలు, పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కోతులను అరికట్టే వారికే మా ఓటు అనే పరిస్థితి వచ్చేలా ఉంది.

Next Story