'బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. మీకు నేను భరోసాగా ఉంటా'

by Sumithra |
బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. మీకు నేను భరోసాగా ఉంటా
X

దిశ, కరీంనగర్ : ఈ ఎన్నికల అనంతరం ఫాం హౌస్ సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం కానుంది.. తెలంగాణలో బీఆర్ఎస్ నావ మునిగిపోనుంది.. డిసెంబర్ 3న వారి కరెంటు కట్ అవడం ఖాయం.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కేవలం ట్రైలర్ మాత్రమే చూశాడు. ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తాం.. అవినీతి, అక్రమాల కుటుంబ పాలన నుంచి తెలంగాణను రక్షించేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. మీకు నేను భరోసాగా ఉంటా.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మీకు తోడుగా నేడు నడుస్తా.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు.." శాతవాహన, కాకతీయులు, మౌర్యుల కర్మభూమి అయిన ఈ గడ్డకు నమస్కారాలంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ వేములవాడ రాజన్నను స్మరించుకున్నారు.

సంజయ్ సూపర్ ఫాస్ట్.. మీరు కూడా సంజయ్ సూపర్ ఫాస్ట్ ను అందుకోవాలంటూ సభలో పాల్గొన్న కరీంనగర్ ప్రజలకు సూచించారు. అనంతరం సభనుద్దేశించి మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయన్నారు. సాగునీటి పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణనే కాదు, యావత్ దేశానికి తెలుసన్నారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ కు తగిన శిక్షపడాలా.. వద్దా..? అని ప్రజలను అడిగారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కుంభకోణాల కాంగ్రెస్, తెలంగాణ వచ్చిన నాటి నుంచి అక్రమాల బీఆర్ఎస్ పాలనల పట్ల ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. తెలంగాణలో పరివర్తన కనిపిస్తోందని, ఇక్కడ మార్పు నిశ్చయమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను పరుగెత్తిస్తారు.. కాంగ్రెస్ ను అడ్డుకుంటారని మోడీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రజలను మోసం చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టవన్నారు. కాంగ్రెస్ సభ్యులకు గ్యారెంటీ లేదని, వాళ్లు ఎప్పుడైనా బీఆర్ఎస్ లో చేరుతారని, కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మళ్లీ కేసీఆర్ ను గద్దె ఎక్కించడమేనన్నారు. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి ఉంటారని మోడీ పునరుద్ఘాటించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని, బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన అవినీతి, అక్రమాలను రూపుమాపి రాష్ట్రాన్ని సంపూర్ణ అభివృద్ధి వైపు నడిపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువని, మోదీని ఎదుర్కుంటే నీ సంపద మొత్తం పోతుందని ఎవరో చెప్పారని, అందుకే తనకు ఎదరుపడడం లేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇలాంటి మూఢనమ్మకాలున్న వ్యక్తి తెలంగాణ లాంటి ఆధునిక సమాజం ఉన్న రాష్ట్రానికి అవసరమా...? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కాం దర్యాప్తు వేగవంతమవుతుంది. కేసీఆర్ కు చెమటలు పట్టిస్తుంది.. బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తుంది.. వాళ్లు దోచుకున్న సొమ్ము కక్కిస్తుందని పేర్కొన్నారు. పొరపాటున కానీ కాంగ్రెస్ వస్తే.. వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. మౌలిక వసతులు అభివృద్ధి చేస్తుంది.. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుంది. రైతుల సమస్యలు పరిష్కరిస్తుంది.. మహిళలకు సులభతర జీవనం అందిస్తుంది.. బీసీ వ్యక్తిని సీఎం చేస్తుంది.. మాదిగలకు న్యాయం చేస్తుంది అంటూ హామీల వర్షం కురిపించారు.

Advertisement

Next Story