తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు

by Sumithra |   ( Updated:2023-11-27 15:14:38.0  )
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు
X

దిశ, జమ్మికుంట : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మార్పు జరగాలంటే హుజురాబాద్ గడ్డ నుంచే మొదలు కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అదే ఓటును భారతీయ జనతా పార్టీకి వేస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 60 లక్షల కోట్లు ఇచ్చాడని గుర్తు చేశారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర రూ.3100 లతో ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని, రాష్ట్ర ప్రజలు ఈ మూడు పార్టీల పరిస్థితులను గమనిస్తున్నారని, అందుకే 30న జరిగే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలను ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం మేరకు రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి, కేంద్రంలో రాహుల్ గాంధీ పీఎం కావాలని జరిగిన ఒప్పందాన్ని పటాపంచలు చేయాలని, ఇందుకోసం బీజేపీకి ఓట్లు వేసి ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ పేదల తరపున మాట్లాడినందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల పై కక్ష్య పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి పంపాడని పేర్కొన్నారు.

అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడారు. తనను ఓడగొట్టి దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. గజ్వేల్ లో నిరుపేదలకు చెందిన వేల ఎకరాల భూములను కేసీఆర్ లాక్కున్నాడని, గజ్వేల్ ప్రాంతంలో 30 వేల మంది కేసీఆర్ బాధితులు ఉన్నారని, అందులో నేను కూడా బాధితుడినే అని అన్నారు. కొంతమంది చిల్లరగాళ్లతో తాను కుంగిపోయేలా కేసీఆర్ చేశాడని, తన పై అక్రమ కేసులు పెట్టాలని చూశాడని, మనం కొట్లాడేది కేసీఆర్ పైన అని, చిల్లరగాళ్లతో పనిలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు పంచాలని చూస్తున్నారని తన వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు. నేను వేసిన రోడ్డుమీద నడుచుకుంటూ కొందరు నాయకులు ఏం పని చేయలేదని అంటున్నారని, అలా మాట్లాడడానికి వారికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More..

మహేశ్వరం గడ్డ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం : అందెల శ్రీరాములు

Advertisement

Next Story

Most Viewed