పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం..చేజారిన ప్రభుత్వ ఉద్యోగం

by Aamani |
పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం..చేజారిన ప్రభుత్వ ఉద్యోగం
X

దిశ,పెగడపల్లి : పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం చేజారింది. కాల్ లెటర్ కోసం కోటి ఆశలతో ఎదురు చూసిన యువకుడు పోస్ట్ మ్యాన్ సకాలంలో లెటర్ ఇవ్వకపోవడం తో ఇంటర్వ్యూ మిస్ అయ్యాడు. పెగడపల్లి మండలం వెంగాళాయిపేట గ్రామానికి చెందిన యాకారి అనిల్ చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి కష్టం తో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలో చదువు పూర్తి చేసి ప్రైవేట్ లెక్చరర్ గా ఉపాధి పొందుతున్నాడు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో ఆఫీస్ సబార్డినేట్ కొలువు కు దరఖాస్తు చేసుకున్నాడు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించాడు.

అయితే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ఇంటర్వ్యూ కు హాజరు కావాలని స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత శాఖ అధికారులు లేఖ పంపారు. ఆగస్టు 31 న లెటర్ పోస్ట్ చేయగా 22 రోజుల తర్వాత పోస్ట్ మ్యాన్ ఈ సెప్టెంబర్ 23 వ తేదీన బాధితుడి తల్లికి లెటర్ అందజేశాడు. పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగానే తాను ఇంటర్వ్యూ కు హాజరు కాలేకపోయానని తృటిలో ఉద్యోగం చేజారిందని తనకు న్యాయం చేయాల్సిందిగా ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉద్యోగం కొడుకుది.. డ్యూటీ తండ్రిది..

వెంగాలాయి పేట పోస్ట్ మ్యాన్ రమాపతి రావు కరీంనగర్ లో ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.దీంతో తనయుడి డ్యూటీ ఆయన తండ్రి గోపాల్ రావు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పోస్ట్ మ్యాన్ తప్పిదాల వల్ల పలు గొడవలు అయినట్టు గ్రామస్థులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కొడుకు స్థానంలో తండ్రి విధులు నిర్వహిస్తున్న విషయం తపాలా శాఖ ఉన్నత అధికారులకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed