కేంద్ర బడ్జెట్: బీజేపీ ప్రశంసలు.. సీపీఎం, సీపీఐ, టీడీపీ విమర్శలు

by Disha News Web Desk |
కేంద్ర బడ్జెట్: బీజేపీ ప్రశంసలు.. సీపీఎం, సీపీఐ, టీడీపీ విమర్శలు
X

దిశ, కరీంనగర్ సిటీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక బడ్జెట్‌పై జిల్లాలో కొంత మోదం.. కొంత ఖేదం అన్నట్లుగా, మిశ్రమ స్పందన వస్తున్నది. అధికార బీజేపీ నాయకులు, కొంతమంది మేధావులు బడ్జెట్‌ను స్వాగతిస్తుండగా, విపక్షాలు, వామపక్షాలు మాత్రం విమర్శిస్తున్నారు. నిర్మలమ్మ పద్దుపై ఎన్నో ఆశలతో ఉంటే సామాన్య జీవులకు నిరాశే మిగిల్చిందనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాకు కేటాయింపులు శూన్యమని, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించకపోవటం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ప్రతిపాదన చేయకపోవడం, విద్యారంగానికి 8 శాతం కూడా కేటాయింపులు చేయకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు వరాలు కురిపించడంలో ఎంపీ బండి సంజయ్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పార్టీల నాయకులు బడ్జెట్‌పై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆ స్పందన వారి మాటల్లోనే..

నవ శకానికి నాంది పలికే బడ్జెట్: బీజేపీ కిసాన్ మోర్చా, జాతీయ నేత పోలీసాని సుగుణాకర్ రావు

దేశాన్ని ప్రగతి పథం వైపు తీసుకెళ్లే బడ్జెట్ ఇది, 68 శాతం రక్షణ రంగంలో దేశ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిచ్చారని, ఉద్యోగ, మౌలిక కల్పనలకు పెద్దపీట వేశారు. ఈ-విద్యా ఒక అద్భుత కల్పనగా, గ్రామీణ అభివృద్ధి, రైతులు, పేదల సంక్షేమానికి సముచిత స్థానం కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అధిక కేటాయింపులు చేసినట్లు, జాతీయ రహదారులు, ఆవాస్ యోజన, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యతనికిచ్చారు. రాష్ట్రాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు. వడ్డీరహిత నిధులు అందజేసేందుకు కేటాయింపులు చేయటం దేశ చరిత్రలోనే మొదటిసారి.

సబ్‌ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా బడ్జెట్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు, గంగాడి కృష్ణారెడ్డి

దేశ ప్రగతిని పరుగులు పెట్టించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్ణయాత్మకమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో అన్ని రంగాలు, వ్యవస్థలతో పాటు, రాష్ట్రాలను బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంగానే బడ్జెట్‌ను రూపొందించడం హర్షణీయం.

తెలంగాణకు మొండిచేయి: సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

కేంద్రం ప్రవేశపెట్టిన 2022-2023 బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, వేతన జీవులకు, వ్యవసాయ కూలీలకు, సాధారణ పౌరులకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. రూ.17లక్షల కోట్ల లోటు బడ్జెట్ కాగా, దానిని ఎక్కడి నుండి సమీకరించుకుంటారో చెప్పకపోవటం విడ్డూరం.

సామాన్యులకు తీవ్ర నిరాశ: టీడీపీ నేత నాగుల బాలాగౌడ్

కరీంనగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అవసరముండగా, ఎంపీ సంజయ్ ఏమాత్రం పట్టించుకోకపోవటంతోనే, జిల్లాకు మొండిచేయి చూపారు. పల్లెల్లో, పట్టణాల్లో ఉపాధి కల్పనకు ఏమాత్రం ప్రియారిటీ ఇవ్వకుండా సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది.

గాలిలో మేడలు కట్టినట్టే కేంద్ర బడ్జెట్: సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గాలిలో మేడలు కట్టినట్లుగా ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో బడ్జెట్‌ పూర్తిగా విఫలమైంది. అర్హులందరికీ ఇండ్లు అనే వాగ్ధానాలను కేంద్రం తుంగలో తొక్కింది. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ళ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్‌ పునాది అనడం హస్యాస్పదంగా ఉంది. జీఎస్టీ వసూళ్ళు పెరిగాయని, అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్నామని చెప్పిన కేంద్రం, ఆ ఫలాలను సామాన్యులకు అందించడంలో మొండిచేయి చూపింది.

Advertisement

Next Story

Most Viewed