కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తా.. బండి సంజయ్

by Sumithra |
కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తా.. బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ : పేదల కోసం కష్టపడి పనిచేసిన నా లాంటోళ్లను గెలిపించకుంటే.. పేదల కోసం ఎందుకు కొట్లాడాలని నా కార్యకర్తలు ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలే.. నా భార్య పిల్లలను చంపుతామన్నా భయపడకుండా ధర్మం కోసం, ప్రజల కోసం ఇన్నాళ్లు పోరాడిన.. నాకు ఓట్లేసి గెలిపించకుంటే నా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏమని చెప్పాలి.. కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్నివర్గాలు మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నయ్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఐదేండ్లు మీకు సేవ చేసుకుంటా.. కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తా' అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ తాను ఒక సామాన్య కార్యకర్తగా నమ్మిన సిద్ధాంతం కోసం, కమల వికాసం కోసం ఇదే కరీంనగర్ లో బీజేపీ కార్యక్రమాల పోస్టర్లను గోడలకు పోస్టర్లు అంటించానని, జాతీయ, రాష్ట్ర నాయకులు వస్తే స్వాగతం పలకడానికి, కార్యక్రమాలు నిర్వహించేందుకు కరీంనగర్ లో పార్టీ జెండాలు కట్టిన సామాన్య కార్యకర్తనన్నారు.

మీరు తయారు చేసిన నాయకున్ని, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా గెలిపిస్తే.. ఈనాడు మీ అందరి ఓట్లతో ఎంపీగా గెలిచిన వ్యక్తిని. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు.. నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజాన్ని సంఘటితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి మీ ముందు నిలబడ్డా అని వ్యాఖ్యానించారు. ఏ రోజైతే మీరు ఎంపీగా గెలిపించారో నాటి నుండి నిరంతరం కొట్లాడిన ఏనాడూ నా సంపాదన, కుటుంబం గురించి ఆలోచించలే.. డబ్బు ఆశ ఉంటే నేను మీకోసం కొట్లాడి జైలుకు పోకపోయేవాడిని నా మీద ఆరోపణలు చేసిన నేతలారా.. నేను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం కరీంనగర్ అసెంబ్లీ ప్రజలకు రాసిస్తా.. ప్రమాణం చేసి చెబుతున్నా.. దమ్ముంటే డాక్యుమెంట్లు తీసుకురండి అంటూ బండి సవాల్ విసిరారు. ఏరోజు నాకు కష్టమొచ్చినా ఇబ్బంది వచ్చినా నా వెనుక మోదీ ఆశీర్వాదం ఉంది.. నా భుజం తట్టి ప్రోత్సహించారన్నారు. ఎవరి కష్టార్జితంతో కరీంనగర్ లో ఇట్లాంటి వాతావరణం చేశారో ఆలోచించండి.. అంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో పోటీ చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల సమయంలో టోపీ పెట్టుకుని నమాజ్ చేస్తారు. ఎన్నికల తరువాత మసీదు జాగాలను కబ్జా చేస్తారు.. ఎన్నికల ముందు గుడికిపోయి దండం పెడతారు.. ఎన్నికలయ్యాక గుడి స్థలాలను మింగేస్తారు.. పేదల ఇండ్లను కూల్చివేస్తారు.. అంటూ తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Next Story