తూము వదిలితే చేపలు పోతాయ్.. తూము ఆపితే పంటలు ఎండుతాయ్..

by Aamani |   ( Updated:2025-04-08 08:33:57.0  )
తూము వదిలితే చేపలు పోతాయ్.. తూము ఆపితే పంటలు ఎండుతాయ్..
X

దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని కల్లూరు గ్రామంలో పాల కుంట చెరువు నింపే విషయంలో రగడ రాజుకుంది. కాలువ మరమ్మత్తులు చేసి చెరువు నింపే బాధ్యతను దక్కించుకున్న వ్యక్తి తూము వద్దే నీటిని ఆపేయడం తో గొడవ ప్రారంభమైంది. తూము వదిలితే మా చేపలు చనిపోతాయని గుత్తేదారు... చెరువు నింపకపోతే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువును వేలంలో పాడుకుని కాలువ మరమ్మత్తులు,. చెరువు నింపే బాధ్యత తీసుకున్న వ్యక్తిని ఇరు వర్గాలు నిలదీస్తున్న పరిస్థితితో గ్రామంలో పితలాటకం మొదలైంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాలువ మరమ్మత్తులు, చెరువు నింపే బాధ్యతతో సదరు చెరువుకు సంబంధించిన హక్కులను రెండు లక్షలకు దక్కించుకున్నారు.

అయితే ప్రస్తుతం పాలకుంట చెరువులో సరిపడా నీరు లేకపోవడంతో రైతులు వెంటనే చెరువు నింపి తూము ద్వారా నీటిని వదలకపోతే పంటలు ఎండిపోతాయని ఆందోళన చేపట్టారు. అయితే చెరువును దక్కించుకున్న వ్యక్తి చేపల కోసం తూము వద్ద నీటిని ఆపేశాడు. దీంతో చేపల కోసం ఆ వ్యక్తితో ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు చేపలకు నీళ్లు ఉంచాల్సిందేనని పట్టుబడుతుండగా, రైతులు తూమును తెరిచి వెంటనే చెరువు నింపాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన సమయంలో కాలువ నీటిని చెరువులోకి తరలించకపోవడం వల్లే నీరంతా వృధాగా వాగులోకి వెళ్లిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో కాలువ మరమ్మత్తులు పూర్తి చేసిన కాలువ ద్వారా చెరువును నింపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు చెబుతున్నారు. దీంతో ఈ సమస్య పంటలు, చేపల పితలాటకం గా మారి గ్రామంలో చర్చనీయమైంది. ఈ విషయంలో తగిన పరిష్కారం కనుగొని ఇరువర్గాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed