క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

by Sridhar Babu |
క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బుధవారం మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్స్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్స్ ను నిర్వహిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి ఓ యూనివర్సిటీని నెలకొల్పనున్నారని చెప్పారు.

గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. క్రీడలకు పుట్టినిల్లయిన సుల్తానాబాద్ లో ఎందరో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని కొనియాడారు. ఇదే పరంపరను కొనసాగించాలని స్థానిక సీనియర్ క్రీడాకారులను కోరారు. ఇందులో భాగంగా జూనియర్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు స్మారకార్థం తెలంగాణ స్థాయి టోర్నమెంట్స్ ను నిర్వహించనున్నట్టు ఆయన క్రీడాకారుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

తాను స్వయంగా బాధ్యత తీసుకొని టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డీవైఎస్ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్, ఎంపీడీఓ, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story