ప్రయాణం ప్రాణ సంకటం.. అదుపు తప్పితే అంతే...

by Aamani |
ప్రయాణం ప్రాణ సంకటం.. అదుపు తప్పితే అంతే...
X

దిశ,సైదాపూర్ : ఇటీవల కురిసిన వర్షాలకు గర్రెపల్లి-సోమారం గ్రామ ప్రజలకు ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. గర్రెపల్లి-సోమారం ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద వాగు ప్రవాహం తగ్గడం లేదు. దీంతో మండల కేంద్రానికి వెళ్లాలంటే గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో సోమారం చౌరస్తా మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో పోను రాను 14 కిలోమీటర్లు దూరాభారం, సమయాభావం పెరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అదునుగా పాఠశాలలకు బస్సుల్లో వెళ్లే విద్యార్థుల నుంచి ఆయా పాఠశాలల యాజమాన్యాలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన అధికారుల్లో స్పందన రావడం లేదు. రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story