విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ

by Shiva |
విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ
X

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసు, పీడీ యాక్ట్

రైతులు అప్రమత్తంగా ఉండాలి

దిశ, మానకొండూర్: కమిషనరేట్ పరిధిలోని మానకొండూరు మండల కేంద్రంలో గల సింధూర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన విత్తనాలతో పాటు ప్యాకింగ్ తీరును పరిశీలించారు. విత్తనాల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు.

ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటల దిగుబడిలో ఎలాంటి నష్టాలకు గురవ్వకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేశారు. గత సంవత్సరం ఈ కేంద్రం నుంచి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు ఎలాంటి దిగుబడులు సాధించారనే విషయాన్ని సెల్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలు కలిగిన విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు. రైతులు మోసపోవద్దని విత్తనాలు తక్కువ ధరకు లభిస్తున్నాయనే ఉద్దేశంతో ప్యాకింగ్, బార్ కోడింగ్ పరిశీలించి అనుమానాస్పదంగా ఉండే విత్తనాలను కొనుగోలు చేయోద్దని తెలిపారు. మానకొండూర్ లో సింధూర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం విత్తన ఉత్పత్తి కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలన్నారు.

కాలం గడువు ముగిసిన విత్తనాలను విక్రయించకూడదని తెలిపారు. రైతులకు భద్రత కల్పిస్తూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే వారికి అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సందర్భంలో ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పంటల సాగులో ఎలాంటి నష్టాల పాలు కాకుండా ఉండేందుకు పోలీసు, వ్యవసాయ, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు.

నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసేపోయే బదులు పంటల సాగు ప్రారంభంలో నిపుణులను సంప్రదించి వారి సూచనల ప్రకారం కొనుగోలు చేసి అధిక దిగుబడులను సాధించాలని తెలిపారు. దిగుబడి సాధనలో ఆశించిన స్థాయిలో విఫలమై నష్టపోవొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులను విక్రయించే వ్యాపారులు, దళారులు, ఏజెన్సీల నిర్వాహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ లను అమలు చేస్తామని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఫోన్ నెం.87126 70760, ఇన్ స్పెక్టర్ ఫో.నెం. 87126 70708 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి నగదు పారితోషికాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి, ఇన్ స్పెక్టర్ సృజన్ రెడ్డి, వ్యవసాయశాఖ ఏవో అధికారి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ బత్తిన శ్రీనివాస్, మానకొండూరు ఇన్ స్పెక్టర్ మదాడి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story