అన్నదాతలకు అండగా.. కడదాక బీజేపీ పోరాటం : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి

by Shiva |
అన్నదాతలకు అండగా.. కడదాక బీజేపీ పోరాటం : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి
X

రైతు వ్యతిరేకి సీఎం కేసీఆర్ మెడలు వంచుతాం

కలెక్టరేట్ ను ముట్టడించిన కాషాయ దళం

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్: వర్షాలు పడుతూ ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా కొనుగోలు సెంటర్లలో నిల్వ చేసిన ధాన్యాన్ని ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా రైతుల ఊసురు పోసుకుంటున్న సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టబోమని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా పేరుతో మంగళవారం కలెక్టరేట్ ను రైతులతో కలిసి ముట్టడించారు.

ఈ సందర్భంగా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాభై రోజులు గడుస్తున్నా.. ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని అన్నారు. బస్తాకు నాలుగు కిలోల మేర తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ పేరుతో కొర్రీలు పెడుతూ, మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చేసి రైతులకు అండగా నిలవాలని హితవు పలికారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను ఏర్పాటు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. అంతకు ముందు వరి ధాన్యాన్ని కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట పారబోసి రైతులు నిరసన తెలిపారు.

ఈ ఆందోళనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, మీసా అర్జున్ రావు, కౌశిక్ హరి, బల్మూరి అమరేందర్ రావు, బల్మూరి వనిత, కౌశిక లత, కన్నం అంజయ్య, పిన్నింటి రాజు, ఆది కేశవులు, పర్ష సమ్మయ్య, పల్లె సదానందం, పుట్ట రవి, మౌఠం నర్సింగం, మంథెన క్రిష్ణ, ఆది సతీష్, మొలుగూరి సాగర్, ఎండి ఫహీం, నాంసాని రాములు, నాంసాని తిరుపతి, వొడ్నాల లక్ష్మయ్య, వడ్కాపురం ఆనంద్, దూలం సతీష్, ప్రుథ్విరాజ్, జ్యోతిబసు, పర్శ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు..

బీజేపీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు సైతం పెద్ద ఎత్తున రైతు మహాధర్నాలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు మహాధర్నా విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న నాయకత్వం మంగళవారం చేపట్టిన మహాధర్నాకు రైతుల నుంచి సైతం మంచి స్పందన రావడం శభ పరిణామమని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story