కేయూలో భారీ కుంభకోభం.. స్వయంగా ఆయనే అవినీతికి పాల్పడ్డారా?

by Gantepaka Srikanth |
కేయూలో భారీ కుంభకోభం.. స్వయంగా ఆయనే అవినీతికి పాల్పడ్డారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిధుల దుర్వినియోగం అంశంతో కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) మరోసారి వార్తల్లోకెక్కింది. ఐసెట్ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఐసెట్ కన్వీనర్ స్వయంగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వస్తున్నాయి. ఐసెట్-2024 నిర్వహణకు సంబంధించిన అంశంలో కన్వీనర్ నర్సింహాచారి రూ.29 లక్షలు తన సొంత ఖాతాలోకి ఏకంగా డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే కేయూ మాజీ వైస్ చాన్స్‌లర్ రమేశ్(Former KU VC Ramesh) పదవి నుంచి వైదొలిగిన మూడు నెలల తర్వాత ఆయన వ్యక్తిగత ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేయడం వంటి అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అలాగే ట్రాన్స్ పోర్టేషన్ పేరిట నెలకు రూ.40 వేల బిల్లులు తీసుకోవడం, ఐసెట్ ఆఫీస్ మెయింటెనన్స్ పేరిట రూ.12 లక్షలు ఖర్చు చేయడం, ఎలాంటి కొటేషన్లు, పర్చేసింగ్ కమిటీ లేకుండా ఇష్టారాజ్యంగా కంప్యూటర్లు కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

6 నెలల్లోనే 92 లక్షలు ఖర్చు

ఐసెట్ నిర్వహణకు ప్రతి ఏటా దాదాపు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చవుతోంది. కానీ గతానికి భిన్నంగా ఈ సంవత్సరం కేవలం 6 నెలల్లోనే రూ.92 లక్షలు ఖర్చు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐసెట్ కన్వీనర్ నర్సింహాచారి ఫిబ్రవరిలో రూ.6 లక్షలు, మార్చిలో రూ.5 లక్షలు, ఏప్రిల్ లో రూ.7 లక్షలు, మేలో రూ.8 లక్షలు, ఆగస్టులో రూ.3.25 లక్షలు కలిపి మొత్తం 29.25 లక్షలు తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ 6 నెలల వ్యవధిలోనే రూ.16 లక్షలు తన అకౌంట్ లో నుంచి కన్వీనర్ సెల్ఫ్ చెక్ లు తీసుకొని డ్రా చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల మేరకు సెల్ఫ్ చెక్ లతో డ్రా చేసిన డబ్బును ఐసెట్ కాన్ఫిడెన్షియల్ విభాగం ఖర్చుకు వినియోగించాలి. కానీ ఎన్ని ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసినా, ఎగ్జామినర్లకు రెమ్యూనరేషన్ చెల్లించినా వాటికి రూ.16 లక్షలు ఖర్చు కావనేది తెలుస్తోంది. అక్కడితోనే ఆగకుండా కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ గా పనిచేస్తూ వర్సిటీ వాహనం ఉపయోగించుకుంటూ నరసింహాచారి ట్రాన్స్ పోర్టేషన్ పేరిట ఐసెట్ కన్వీనర్ ఖాతా నుంచి అదనంగా నెలకు రూ.40 వేలు వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆగస్టు తర్వాత ఐసెట్ కన్వీనర్ ఖాతా ఖాళీ అవడంతో స్టేట్ కౌన్సిల్ కూడా సదరు కన్వీనర్ అకౌంట్ కు డబ్బులు జమ చేయడానికి విముఖత చూపినట్లు సమాచా రం. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి ఫి ర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

పదవి ముగిసినా చెల్లింపులు

కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ రమేష్ మే 21 వరకు కేయూ వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడేళ్లలో ప్రతి ఏటా రూ.2 లక్షల చొప్పున ఐసెట్ చైర్మన్ పేరిట రెమ్యూనరేషన్ తీసుకున్నారు. మూడేళ్ల పదవీకాలం తర్వాత కూడా మరో రూ.2 లక్షలు చైర్మన్ పేరిట ప్రొఫెసర్ నరసింహాచారి తాటికొండ రమేశ్ కు చెల్లించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఆగస్టులో వీసీ రమేశ్ కు రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో కేయూ వీసీగా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ కు సంబంధించిన ఫీజు ఆయన తీసుకోకుండా ఆ తర్వాత వచ్చిన వీసీ తీసుకుంటారని చెప్పడం గమనార్హం. కానీ ప్రస్తుతం నాలుగో సంవత్సరం కూడా మాజీ వీసీ రమేశ్ చైర్మన్‌గా లేకున్నా కూడా రూ.2 లక్షలు చెల్లించారని తెలుస్తోంది. అంతేకాకుండా రూ.86 వేలకు ఒక కంప్యూటర్ చొప్పున మొత్తం 6 కంప్యూటర్లను రెండు వేర్వేరు దుకాణాల్లో కొనుగోలు చేసినట్టు తెలిసింది. రూ.87,849కు ఒక కంప్యూటర్ చొప్పున రెండు కంప్యూటర్లను ఒక దుకాణంలో కొనుగోలు చేస్తే, రూ.86,749 ఒక కంప్యూటర్ చొప్పున మొత్తం మూడు కంప్యూటర్లను మరొక దుకాణంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంత మొత్తంలో డబ్బు కేటాయించి కంప్యూటర్ కొనుగోలు చేయాలంటే వీటికి కొటేషన్లు, పర్చేస్ కమిటీ అప్రూవల్ ఉండాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే ఈ కంప్యూటర్లను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

ఒకే ప్రొఫెసర్‌కు రెండు పదవులు

సెట్ల నిర్వహణకు కన్వీనర్ల నియామకం కోసం యూనివర్సిటీ నుంచి ముగ్గురు పేర్లను వీసీ, ప్రిన్సిపల్ సెక్రెటరీకి సూచించాలి. వీరిలో ఒకరిని ప్రిన్సిపల్ సెక్రటరీ.. కన్వీనర్ గా నియమిస్తారు. ప్రతి ఏటా కేయూ కామర్స్ కాలేజీ నుంచి సీనియర్ ప్రొఫెసర్ల జాబితాను పంపిస్తున్నారు. కానీ ఈసారి కామర్స్ విభాగం ప్రొఫెసర్ నరసింహాచారిని మాజీ వీసీ రమేశ్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ‌తో కన్వీనర్ ను నామినేట్ చేయించినట్లు తెలుస్తోంది. నరసింహాచారినే కేయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా కూడా నియమించారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఆయన ఐసెట్ కన్వీనర్ గా సైతం బాధ్యతలు తీసుకున్నారు. ఒకే ప్రొఫెసర్ కు రెండు పదవులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఐసెట్ అక్రమాల్లో మాజీ వీసీ రమేష్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ అంశాలపై ప్రస్తుత ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Advertisement

Next Story