Bhatti: ఇందిరమ్మ రాజ్యంలో అది సాధ్యమే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Ramesh Goud |
Bhatti: ఇందిరమ్మ రాజ్యంలో అది సాధ్యమే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు రైతులకు పండుగ దినం అని, ఇందిరమ్మ రాజ్యంలో రైతు రుణమాఫీ సాధ్యం అవుతుందని, చెప్పిన విధంగా సీఎం ఛాలెంజ్ ని నిరుపించుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2 లక్షల రుణమాఫీలో భాగంగా రెండో విడత కార్యక్రమాన్ని అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఆనాడు ప్రమాణ స్వీకారం అనంతరం గంటల సమయం కూడా వృధా చేయకుండా రెండు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. అలాగే ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఎంత త్వరితగతిన చేస్తున్నాం అంటే.. జూలై 15 న నిబంధనలు ఫైనల్ చేస్తే.. జూలై 18న మొదటి విడత విడుదల చేయడం జరిగందని, కేవలం మూడు రోజుల్లోనే 11.50 లక్షల మందికి 6,098.93 కోట్ల రూపాయలతో ఓకే సారి లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని అన్నారు. అలాగే ఇదే జూలైలో రెండో విడత రుణమాఫీని 6,190 కోట్లతో 6.4 లక్షల అకౌంట్లలో 5,47,407 మంది కుటుంబాలకు లబ్ది చేకూరేలా చేస్తున్నామని తెలిపారు. దీంతో మొత్తం 17.91 అకౌంట్లలో 16.29 లక్షల కుటుంబాలకు 12,208 కోట్ల రూపాయలు మాఫీ అయ్యిందన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రైతులకు చెక్ ఇస్తుంటే.. మిగతా రైతుల అకౌంట్లలోకి 6,190 కోట్లు చేరుతాయని స్పష్టం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభకు వెళుతున్న సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలతో ప్రయాణం చేశానని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రుణ మాఫీనే చేయలేకపోయింది. 2 లక్షలు సాధ్యం అవుతుందా అని అడిగితే.. వారు నిస్సందేహంగా సాధ్యం అవుతుందని చెప్పారని అన్నారు.

దాని ప్రకారమే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాక ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు మేలు జరిగేలా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని సభలో రాహుల్ గాంధీ చెప్పారని, అన్నట్లుగానే రైతు రుణమాఫీ కూడా చేస్తున్నామని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఏ ఏడాదికో, ఐదేళ్లకో చేస్తుందని ఊహించారు. కానీ వారి ఊహలను పటాపంచలు చేస్తూ.. ఎన్నికల ముందు ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాపీపై ప్రకటన చేసినప్పుడు ఆశ్చర్యపోయారని అన్నారు. ఆ ఆశ్చర్యాన్నే నిజం చేస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ నెల కల్లా 2 లక్షలు రుణమాఫీ చేసి సీఎం ఛాలెంజ్ ని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. అంతేగాక 42 లక్షల రైతులకు సంబందించిన రైతు భీమా ప్రీమియమ్ డబ్బు 1,580 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని స్పష్టం చేశారు. అలాగే పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన క్రాప్ ఇన్సూరెన్స్ ను ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1,350 కోట్లతో చేయబోతుందన్నారు. ఇక ఈ రోజు రాష్ట్రంలోని రైతులకు పండుగ దినం అని, బ్యాంకుల్లోని రుణం అంతా ఒక్కసారే మాఫీ అవుతుండటంతో రైతుల గుండెల్లోని భారమంతా దిగిపోయినట్టు ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement

Next Story

Most Viewed