ఇంటర్ అడ్మిషన్స్ పై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన

by M.Rajitha |   ( Updated:2025-02-12 16:51:38.0  )
ఇంటర్ అడ్మిషన్స్ పై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తికాకముందే, జూనియర్ కాలేజీల్లో అనధికారిక ప్రవేశాలు చేపడుతన్నారన్న వార్తలు వివిధ పత్రికా మాధ్యమాల్లో వస్తున్నాయని, ఇంటర్మీడియట్ బోర్డు పై, అడ్మిషన్ ప్రక్రియలో పీఆర్ఓలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు వాస్తవాలను వెల్లడించింది. రాబోయే విద్యా ఏడాదికి సంబంధించి 2025-2026 కోసం అనుబంధ నోటిఫికేషన్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయలేదని ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను, అడ్మిషన్ షెడ్యూల్‌కు ముందు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామన్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుబంధ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు.

అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, తాత్కాలికంగా అనుబంధ జూనియర్ కళాశాలల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ tgbie.cgg.gov.in , acadtgbie.cgg.gov.in లలో ప్రదర్శిస్తామని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అనుబంధ జూనియర్ కళాశాలల్లో మాత్రమే చేర్చుకోవాలని సూచించింది.ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించే అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు ఖచ్చితంగా నిర్వహించాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల అన్ని యాజమాన్యాలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయాని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే 2025-26 విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుబంధ గుర్తింపు ప్రక్రియను చేపట్టబోమని వెల్లడించింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు బోర్డు ఆదేశాలను పాటించాలని కోరింది.



Next Story

Most Viewed