అతి త్వరలో గవర్నర్‌ను కలిసి కంప్లైంట్ చేస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
అతి త్వరలో గవర్నర్‌ను కలిసి కంప్లైంట్ చేస్తాం.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సివిల్ సప్లై శాఖ రూ.54 వేల కోట్ల అప్పుల్లో ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల సివిల్ సప్లై శాఖ అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. ధాన్యం కొనుగోలులో మొత్తం ఐదుగురు టెండర్లు దక్కించుకున్నారని తెలిపారు. టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు, మిల్లర్ల మధ్య కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని కీలక ఆరోపణలు చేశారు. వరి కొనుగోలు అంశంలో గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని విమర్శించారు. సుమారు 70 నుంచి 75 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల దగ్గర మిగిలిపోయిందని అన్నారు. 40 లక్షల ధాన్యం కొనుగోలు కాకుండా నిలిచిపోయిందని తెలిపారు.

ఇప్పుడు మళ్ళీ పంట రాబోతోందని.. ఇప్పటికి కూడా ప్రభుత్వ ప్రణాళికలు ఏంటో తెలియదని అన్నారు. సరైన సమయంలో బిడ్డర్లు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వంపై వడ్డీ భారం తగ్గేదని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వేల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. నయా పైసా పూచీకత్తు లేకుండా మిల్లర్లకు 50 కోట్ల టన్నుల ధాన్యాన్ని అప్పజెప్పారు. మిల్లర్ కెపాసిటి కేవలం 3 వేల కోట్ల మాత్రమే.. 50 వేల కోట్ల టన్నుల ధాన్యాన్ని ఎట్లా అప్పజెప్తారు..? అని ప్రశ్నించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం టెండర్ పెట్టింది. ఇంకా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలి ఉందని అన్నారు. మిల్లర్లు ఎవరి పెరుమీద ఉందో తెలియని మిల్లర్లకు అంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ఏ ప్రాతిపదికన అప్పజెప్పారని అడిగారు. ధాన్యం కొనుగోలుపై సమగ్రంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై గవర్నర్‌ను కలుస్తామని కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలు అవకతవకల అంశాన్ని సీబీఐకి అప్పజెప్పలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed