కష్టపడి గెలిపిస్తే.. అవమానిస్తున్నారు..! జైపాల్‌రెడ్డి అసహనం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-29 08:02:16.0  )
కష్టపడి గెలిపిస్తే.. అవమానిస్తున్నారు..!  జైపాల్‌రెడ్డి అసహనం
X

దిశ, అందోల్ : బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను తొలిగించుకొని సమన్వయపరిచేందుకు పార్టీ అధిష్టాన వర్గం అత్మీయ సమ్మేళానాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అందోలు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పటాన్‌చెరువు మండలం ఇంద్రేశంలోని ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి సమన్వయకర్తగా ఎమ్మెల్సీ వెంకటరాంరెడ్డి హజరుకావాల్సి ఉండగా వివిధ కారణాలతో హజరు కాలేకపోయారని పార్టీ శ్రేణులు తెలిపారు.

ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొదటగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలో ఇప్పటి వరకు ఏమైనా కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బందులు జరిగితే వాటిని సరిదిద్దుకుందామని, వచ్చే ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొ్ందామని, నాకు ఎవరితోనే విభేదాలు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందోలు జడ్పీటీసీ రమేశ్‌ తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నాడని, సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి వదిలిన బాణం అంటూ మాజీ కౌన్సిలర్‌ గాజుల నవీన్‌ సమావేశంలో ప్రస్తావించడంతో వేదికపై ఉన్న జైపాల్‌రెడ్డి కల్పించుకొని ఎమ్మెల్యే వద్ద నుంచి మైకును తీసుకొని ఎవరినో ప్రోత్సహించాల్సిన అవసరం తనకు లేదని, గత ఎన్నికల సమయంలో టికెట్టు విషయంలో జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా క్రాంతి కిరణ్‌ గెలుపు కోసం చాలా కష్టపడ్డానని, గెలిచిన తర్వాత సరైన గౌరవం తనకు దక్కలేదన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. తన సతీమణి జడ్పీ చైర్‌‌పర్సన్‌గా ఉన్నప్పటికీ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వనించకుండా అవమానిస్తున్నారన్నారు. నియోజవర్గానికి గుండే కాయలాంటి అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో ఆసమ్మతిని వ్యక్తం చేస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లను సమన్వయ పరచకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, వారిని పిలిచి మాట్లాడాలని మాజీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పి.శివశేఖర్‌ సూచించారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అనుకొవడం కూడా పోరపాటే అవుతుందని సీనియర్‌ నాయకుడు పుల్కల్‌ నర్సింహ్మరెడ్డి అన్నారు.

వివాదస్పదమైన భూములను కొందరు దక్కించుకుని తమ పేర్లను వాడుకుంటున్నారని, ఆ భూములతో ఎమ్మెల్యేకు కానీ, నాకు ఏలాంటి సంబంధం లేదని, గజం స్థలాన్ని కూడా కబ్జా చేయలేదని ఎమ్మెల్యే సోదరుడు రాహుల్‌ కిరణ్‌ అన్నారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను చేయవద్దని ఎమ్మెల్యే సోదరుడు రాహుల్‌ కిరణ్‌కు మాజీ ఎంపీపీ రామాగౌడ్‌ సూటిగా అనడంతో సమావేశంలో పాల్గొన్న వారంతా అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే వర్గం, తమ్ముడి వర్గమంటూ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు.

టేక్మాల్‌ మండలంలో గ్రూపు విబేధాలున్నాయని, వాటిని సమన్వయ పరచడం నా వల్ల కావడం లేదని మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో స్థానిక నినాదాన్ని బలపరచడంతో పాటు టిక్కెట్‌ విషయంలో తానేంతో కష్టపడ్డానని, కానీ తగిన ప్రాధాన్యత పార్టీలో దక్కడం లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు భిక్షపతి అన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ విధేయుడుగా ఉంటానని, వారి వల్లనే నాకు ఇంతటి పేరు వచ్చిందన్నారు. ఆయా మండలాల నాయకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు. మండలానికోక అత్మీయ సమ్మేళానాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

హాట్‌ టాపిక్‌గా జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు

నియోజకవర్గంలోని కింగ్‌ మేకర్‌గా ఉన్న మాజీ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి అత్మీయ సమ్మేళనంలో మాటాల తుటాలను పేల్చారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య ఉన్న అంతర్గత విబేధాలను అయన బహిర్గతం చేశారు. అక్కడికి వచ్చిన నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ ప్రశ్నలను సంధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా గంటకు పైగా ఈ అంశాలపై మాట్లాడడం నాయకులను ఆశ్యర్చానికి గురిచేసింది. ఆయన మాట్లాడిన తీరుపై నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు టిక్కెట్‌ను అధిష్టానం కేటాయిస్తే సహకరిస్తారా? లేదా వేరే వారికి టిక్కెట్‌ ఇప్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Read more:

బిగ్ న్యూస్ : ఎన్నికల వేళ T - కాంగ్రెస్‌లో కొత్త కన్ఫ్యూజన్....ఆ అంశంలో కేసీఆర్ స్టాండ్‌తో హస్తం పార్టీలో డైలమా!....అందుకే కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్ విషయంలో సైలెంట్ అయ్యారా..?!

Advertisement

Next Story

Most Viewed