ఇతర రాష్ట్రాల్లో రేవంత్ ఫోటో పెడితే ఇక్కడ కూడా ఆలోచిస్తాం: ప్రభుత్వ విప్ అడ్లూరి

by Ramesh Goud |
ఇతర రాష్ట్రాల్లో రేవంత్ ఫోటో పెడితే ఇక్కడ కూడా ఆలోచిస్తాం: ప్రభుత్వ విప్ అడ్లూరి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు రావాల్సిన వాటాను సక్రమంగా ఇచ్చి, పథకాలలో ఫోటో పెట్టడం గురించి మాట్లాడాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Government Whip Adluri Lakshman Kumar) అన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల పంపిణీ విషయంలో ప్రధాని మోడీ ఫోటో (PM Modi Photo) ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటే మా ఫోటో పెట్టండి అని అడగడానికి గల కారణమేంటో చెప్పాలన్నారు. పథకాలలో కేంద్రానికి వాటా ఉందని చెబితే.. మరి కేంద్రానికి రాష్ట్రం నుంచి దామాషా ప్రకారం ఇచ్చే నిధులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పన్నుల ద్వారా తెలంగాణ నుంచి వసూలు చేసిన డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారని, వేరే రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫోటో పక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో (Telangana CM Revanth Reddy Photo) పెడుతున్నారా అని నిలదీశారు. వేరే రాష్ట్రాల్లో మోడీ ఫోటో పక్కన రేవంత్ రెడ్డి ఫోటో పెడితే తెలంగాణలో కూడా మోడీ ఫోటో పెట్టడం గురించి ఆలోచన చేస్తామని అన్నారు. పేదలకు పంపిణీ చేసే సంక్షేమ పథకాలలో మా వాటా ఉంది మా ఫోటో పెట్టండి అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాను దామాషా ప్రకారం చెల్లించి, తర్వాత ఫోటో గురించి మాట్లాడాలని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయమే చేస్తో్ందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సరైన వాటా చెల్లించకుండా మాకు వాటా ఉన్నదని మాట్లాడే నైతిక హక్కు కేంద్రమంత్రులకే కాదు.. ప్రధాన మంత్రికి కూడా లేదని ప్రభుత్వ విప్ ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed