- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTPC ప్రాజెక్టు వేరే రాష్ట్రాలకు పోతే.. తెలంగాణకు నష్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా ఉండటంతో ఆయన ఘాటుగా స్పందించారు. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదని ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా.. రాష్ట్రప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టునకు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని గుర్తుచేశారు.
మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని, రూ.10,598.98 కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో.. మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను గతేడాది అక్టోబర్ లో, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఈ ఏడాది మార్చిలో మోడీ జాతికి అంకితం చేశారన్నారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 4 వేల మెగావాట్ల ప్రాజెక్టులో మిగిలిన 240 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తుందని ఆయన వివరించారు. ఇందుకు ఎన్టీపీసీతో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్ కో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఆ తర్వాతే ప్లాంట్ల ఏర్పాటుకు, తగినంత బొగ్గు అందుబాటులో ఉంచుకోవడం మొదలైన అంశాలపై ఎన్టీపీసీ పని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్-II ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుదుత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు. ట్రాన్స్ కో నుంచి కూడా ఎలాంటి సమాధానం లభించలేదన్నారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్-II ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగానే భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీ ఇప్పటికే లేఖలో పేర్కొందన్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేకుంటే.. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను విక్రయించేందుకు అనుమతి ఉంటుందని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందని తెలిపారు. 30 మే 2024 నాడు దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, మార్చి 2024 లో తెలంగాణలో గరిష్ఠంగా(పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుందని ఆయన వివరించారు. అందుకే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదేనని, కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా.. దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతోందనేది మరోసారి నిరూపితమైందని ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్టీపీసీ రాస్తున్న లేఖలపై స్పందించి.. పవర్ పర్చేస్ చేసుకుంటే అంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుందని, అధికారులు, సర్కార్ అలసత్వానికి.. ప్రజలెందుకు నష్టపోవాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.