Harish Rao Challenge: రాజీనామాకు నేను రెడీ.. సీఎంకు హరీశ్ రావు మరోసారి చాలెంజ్

by Prasad Jukanti |   ( Updated:2024-07-18 13:44:23.0  )
Harish Rao Challenge: రాజీనామాకు నేను రెడీ.. సీఎంకు హరీశ్ రావు మరోసారి చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2లక్షల పంట రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13 హామీలు) సంపూర్ణంగా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని అమలు చేయని పక్షంలో మీరు రాజీనామాకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది మీరేనని ధ్వజమెత్తారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపింది తమరేనని ఎద్దేవా చేశారు. నిరంతరం పారిపోయిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర మాదేనని స్పష్టంచేశారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది అని అన్నారు. నాకు పదవులు, రాజకీయాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనన్నారు.

Advertisement

Next Story