Ekka Yadagiri Rao : రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను గుర్తించడం ఆనందాన్ని కల్గించింది : ఎక్కా యాదగిరిరావు

by Y. Venkata Narasimha Reddy |
Ekka Yadagiri Rao : రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను గుర్తించడం ఆనందాన్ని కల్గించింది : ఎక్కా యాదగిరిరావు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా నన్ను గుర్తించి ఆ కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు సత్కారంతో గౌరవించుకుంటామని చెప్పడం నాకు అమితానందాన్నిచ్చిందని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిరావు(Ekka Yadagiri Rao)అన్నారు. గత ప్రభుత్వాన్ని తాను సంప్రదించినా గుర్తించి గౌరవించలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని విధంగా నేను ఎలాంటి ప్రయత్నం చేయకపోయిన ఇంట్లో ఉన్న నన్ను గుర్తించి ఇంటికి కారు పంపి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం ఆశ్చర్యం కల్గించిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో చేయాలన్న తపన ఆయనలో కనిపించిందని, ఆయన పక్కా తెలంగాణ మనిషి అని ప్రశంసించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అనేక పర్యాయాలు గన్ పార్కు అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ఆవిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని, స్వయంగా కేసీఆర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చిన స్థూపావిష్కరణతో పాటు నన్ను కూడా పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలిదశ ఉద్యమం (1969) లో అమరులైన 369 ఉద్యమకారుల సంస్మరార్ధం హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లో తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం నిర్మించబడింది. 1970, ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగావున్న గన్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటుచేశారు. పోలీసు నిర్భంధాలను ఛేదించి అప్పటి నగర మున్సిపల్ మేయర్ లక్ష్మినారాయణ చేతులమీదుగా అమరవీరుల స్మారకస్థూపానికి శంకుస్థాపన చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నారెడ్డిని, మల్లికార్జున్ ను, మేయర్ లక్ష్మినారాయణను, టి. గోవింద్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్ పార్కులో స్థాపించిన స్మారక స్థూపం శిలాఫలకాన్ని 28న పోలీసులు తొలగించారు. దాంతో ఆ శిలాఫలకాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని పెద్దఎత్తున సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది. అందులో 12 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కౌన్సిలర్ల చొరవతో తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం నిర్మితమైంది.

జెఎన్టీయూలో ఆచార్యుడిగా పనిచేసిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ కళాకారుడు, తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం శిల్పి ఎక్కా యాదగిరిరావు తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపాన్ని నిర్మించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదలచేయకుండా ఎన్నో ఆటంకాలను సృష్టించినా 1975లో స్థూప నిర్మాణం పూర్తయింది. కానీ స్మారక స్థూపం అవిష్కరణ మాత్రం నేటికి జరగలేదు. స్మారక స్థూపం నిర్మాణానికి యాదగిరి రూ.4 లక్షలు ఖర్చు చేస్తే, కేవలం రూ.50 వేలు మాత్రం చెల్లించారు. అనేక ప్రత్యేకతలతో యాదగిరి స్థూపాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగాక ప్రతి సంవత్సరం జూన్ 2 ను తెలంగాణ అమరవీరుల స్మారక దినంగా జరుపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినప్పటికి.. అమర వీరుల స్మారక స్థూపావిష్కరణ గాని, శిల్పి ఎక్కా యాదగిరికి గుర్తింపుగాని దక్కలేదు. తదుపరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని చేర్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడి ప్రభుత్వం ఆయనను గుర్తించి సత్కరించాలనుకోవడం యాదగిరితో పాటు ఉద్యమకారులను ఆనందానికి గురి చేసింది.

Advertisement

Next Story

Most Viewed