మార్పు కోసం ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు : జి.కిషన్​రెడ్డి

by Sumithra |
మార్పు కోసం ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు : జి.కిషన్​రెడ్డి
X

దిశ, చార్మినార్ :​ 17 రోజులుగా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తర​ ఖాండ్​లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు అమ్మవారి ఆశీస్సులతో సురక్షితంగా బయటపడడం ఎంతో గొప్ప విషయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 17 రోజుల పాటు చర్చలు జరిపి, శ్రమించి కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బుధవారం చారిత్రాత్మక చార్మినార్​ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, చివరగా తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఎన్నికలు జరుగనున్నాయన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సమగ్రమైన మార్పుకు అందరూ కూడా ఆలోచించాలని, ఎవరు కూడా ఏ రకమైన ప్రలోభాలకు, డబ్బులకు, మద్యానికి లొంగొద్దని సూచించారు. రాజ్యాంగం మనకిచ్చిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సానుకూలంగా ఉపయోగించుకోవాలన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా విధిగా పోలింగ్​ బూత్​లకు వెళ్లి రేపు ఉదయం అన్ని వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తప్పకుండా దేశ, రాష్ట్ర ప్రజల మీద శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. దేశం, రాష్ట్రం వేగవంతంగా ముందుకు వెళ్లాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంగా వెల్లివిరియాలని కిషన్​ రెడ్డి అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed