ముషీరాబాద్​ టికెట్టుపై అధిష్టానం పునరాలోచించాలి

by Sridhar Babu |   ( Updated:2023-10-17 09:29:59.0  )

దిశ, ముషీరాబాద్ : కాంగ్రెస్​ పార్టీ అభ్యున్నతి కోసం పార్టీ జెండాను భుజాన వేసుకొని ముషీరాబాద్​ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తున్న తమను కాదని స్థానికేతరుడైన అంజన్​కుమార్​ యాదవ్​కు పార్టీ టికెట్​ కేటాయించడం ఏమిటని టికెట్​ ఆశించి బంగపడ్డ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్​ముదిరాజ్, ఐఎన్​టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లవెల్లి అంజిరెడ్డి, కాంగ్రెస్​ ఫిషర్​మెన్ ​కమిటీ కార్యదర్శి

బిజ్జిశత్రు సతీమణి బిజ్జి మాధవిలు ముషీరాబాద్​ నియోజకవర్గం కాంగ్రెస్​పార్టీ టికెట్​ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. టికెట్​ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయిన్పటికీ అధిష్టానం స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానికేతరుడైన అంజన్​కుమార్​యాదవ్​కు టికెట్​ కేటాయించడంపై ఎవరికి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముషీరాబాద్​ టికెట్​ విషయంలో మరోసారి అధిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, స్థానికులకే టికెట్​ కేటాయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధిష్టానం పునరాలోచించాల్సిందే : బిజ్జి శత్రు

ముషీరాబాద్​ నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ టికెట్ పై కాంగ్రెస్​ అధిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. తమ అభిప్రాయాలను కూడా పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలి. నియోజకవర్గంలో గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ముషీరాబాద్ నుంచి గంగపుత్రులకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్​ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ ​సీనియర్​ నాయకురాలు గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన బిజ్జి మాధవి కి టికెట్​ కేటాయించకుండా స్థానికేతరులకు కేటాయించడం బాధాకరం. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి ముషీరాబాద్​లో గంగపుత్రులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి.

పార్టీ నాకు అన్యాయం చేసింది : సంగిశెట్టి జగదీశ్వర్​రావు

అధిష్టానం ఆదేశాల మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నాను. ఖచ్చితంగా ఈసారి టికెట్​ తనకు ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీ అన్యాయం చేసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ నన్ను కాదని ముషీరాబాద్​ నియోజకవర్గం టికెట్​ను స్థానికేతరుడైన అంజన్​కుమార్​యాదవ్​కు కేటాయించింది. నేను పద్మశాలి సామాజిక వర్గానికి చెందనవాడిని, మా పద్మశాలీల ఓట్లే దరిదాపు నలభై వేలు ఉన్నాయి. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంది. పార్టీ అభ్యున్నతి కోసం నిరంతరం చిత్తశుద్ధితో పాటు పడుతున్న నన్ను కాదని మరొకరికి టికెట్ కేటాయించడం బాధకలిగించింది.

టికెట్ ఆశించి బంగపడ్డాను : నాగేష్​ముదిరాజ్​

ముషీరాబాద్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా టికెట్​ ఆశించి బంగపడ్డాను. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీ నాకు టికెట్​ కేటాయించకపోవడం తీవ్ర అసహనానికి గురిచేసింది. రెండున్నర దశాబ్దాలుగా పార్టీకోసం అంకితభావంతో పనిచేసి పార్టీని పటిష్టంగా రూపాందించా. నాకు టికెట్ కేటాయించాలని ముషీరాబాద్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ప్రతిపాదించినప్పటికీ అంజన్​కుమార్​యాదవ్​కు టికెట్​ కేటాయించడం పట్ల మా వర్గానికి చెందిన నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మిత్రులు, సన్నిహితులు, అనుచరులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాను.

ముషీరాబాద్​ టికెట్​ కేటాయింపులో ఐఎన్టీయూసీకి అన్యాయం : నల్లవెల్లి అంజిరెడ్డి

కాంగ్రెస్​ పార్టీ టికెట్​ కేటాయింపులో తనకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఐఎన్టీయూసీకి ముషీరాబాద్, ఆలేరు, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టికెట్లు కేటాయించాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మజీ ఎంపీ సంజీవరెడ్డి ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ముషీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా ఐఎన్టీయూసీ కోటాలో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ టికెట్​ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నాను. స్థానికుడిని, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినైన నాకు టికెట్​ కేటాయించకుండా అంజన్​కుమార్​యాదవ్​కు టికెట్​కేటాయించింది. పార్టీ అధిష్టానం ఐఎన్టీయూసీ కోటాలో ఒక్క టికెట్​కూడా కేటాయించక పోవడం బాధాకరం.

సంబరాలు చేసకున్న అంజన్​వర్గం

ముషీరాబాద్​ నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం అంజన్​కుమార్​ పేరును మొదటి జాబితాలోనే ప్రకటించడంతో ఆయన వర్గం హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్​పార్టీ బి బ్లాక్​ అధ్యక్షుడు అంజియాదవ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో మాజీ కార్పొరేటర్లు కల్పనాయాదవ్, మహ్మద్​ వాజిద్​హుస్సేన్​, నాయకులు పాశం అనిల్​కుమార్​యాదవ్, మేడి సురేష్​ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి బాణా సంచా పేల్చారు. కాంగ్రెస్ ​పార్టీ అధిష్టానం గెలిచే అభ్యర్థికి టికెట్టు కేటాయించిందని సంతోషం వ్యక్తం చేశారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ను ఎదుర్కొని విజయం సాధించే సత్తా అంజన్​కుమార్​యాదవ్​కే ఉందని, ఆయనకు టికెట్​ కేటాయించిన అధిష్టానానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed