- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
'హెచ్ఆర్సీ చైర్మన్, లోకాయుక్త నియామకం నిబంధనల మేరకు జరుగలేదు'

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్సీ), లోకాయుక్తల నూతన పాలక వర్గం నియామకం నిబంధనల మేరకు జరుగలేదని, ఇందుకు సంబంధించిన ఫైలును ప్రభుత్వానికి తిప్పి పంపాలని బుర్ర శ్రీనివాస్, గుడిచుట్టు రామనాథం అనే సామాజిక కార్యకర్తలు గవర్నర్ జిష్టు దేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్ కు వారు లిఖిత పూర్వకంగా స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నూతన పాలకవర్గం ఏర్పాటు చేసేందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్పరం జూన్ 11వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిందని, దరఖాస్తులు తీసుకునేందుకు చివరి తేదీని జూన్ 29గా నిర్ణయించిందన్నారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని కూడా ప్రకటించిందన్నారు. అయితే ప్రస్తుతం కమిషన్ చైర్మన్ గా ప్రకటించిన జస్టిస్ షమీమ్ అక్తర్ గడువు లోగా దరఖాస్తు చేయలేదని అయినా నిబంధనలను పక్కనపెట్టి ఆయనను ఎంపిక చేశారన్నారు.
అదేవిధంగా తెలంగాణ లోకాయుక్త నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండానే జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిని ఎంపిక చేశారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. హెచ్ఆర్సీ చైర్మన్ మాదిరిగానే దరఖాస్తు చేసుకోని వారిని, అర్హత లేని వారిని రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ గా , కమిషనర్లుగా నియమిస్తారనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల ఫైలును తిప్పి పంపాలని, హెచ్ఆర్సీ చైర్మన్ గా అర్హతతో పాటు నిర్ణీత నోటిఫికేషన్ గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలని, లోకాయుక్త నియామకం కోసం నోటిఫికేషన్ జారీ అనంతరం అర్హులను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు గవర్నర్ ను కోరారు. కాగా గుడి చుట్టూ రామనాథం ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. వారు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .