Hyderabad News: అడిగినంత ఇవ్వాల్సిందే.. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-16 09:43:28.0  )
Hyderabad News: అడిగినంత ఇవ్వాల్సిందే.. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ
X

దిశ, సంగారెడ్డి: జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులుం కొనసాగుతున్నది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా తెరువని విషయం తెలిసిందే. కరోనా సమయంలో పాఠశాల యాజమాన్యాలు పూర్తి ఫీజులు చెల్లించాల్సిందేనని ఆన్లైన్ తరగతులు నిర్వహించామని విద్యార్థులపై ఒత్తిడిని తీవ్రతరం చేశారు. కరోనా సమయంలో సగం ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. వాటిని యాజమాన్యాలు పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఫీజులతో పాటు ఈ విద్యా సంవత్సరం ఫీజులను సైతం పూర్తిగా చెల్లించాలని విద్యార్థులను వేధిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం నుంచి ఫీజుల మోతతో తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. 'తమను అడిగేవారు లేరు.. మేము అడిగినంత ఇవ్వాల్సిందే' అంటూ వేలకు వేలు ఫీజులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పెంచుకుంటూ పోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి వారి ఆమోదంతోనే ఫీజులను పెంచాలి. కానీ జిల్లాలో ఎక్కడ కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు . వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదు. ఇరుకు చీకటిగదుల్లో విద్యాబోధన, ఆడుకునేందుకు ఆట స్థలాలు సరైన వసతి కల్పించకుండా కేవలం ఫీజులు వసూలు మాత్రమే చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

అమలు కాని ప్రభుత్వ నిబంధనలు

ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఎక్కడ పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులను రూ. 12500 తీసుకోవాలి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు పట్టణ ప్రాంతాల్లో నర్సరీ నుంచే రూ. 20 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు. వాటితోపాటు పుస్తకాలు ,టై ,బెల్టులు అదనంగా కొనుగోలు చేయాల్సిందే. అయినా వాటన్నింటిని భరిస్తూ తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్న యాజమాన్యాల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం వార్షిక పరీక్షల పేరుతో మొత్తం ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తాం.. పరీక్షలు రాయనీయమంటూ విద్యార్థులను వేధిస్తున్నారు. అదేవిధంగా ఫీజు కట్టని విద్యార్థులను పరీక్షలు రాయ నీయకపోవడమే కాకుండా తరగతి గదిలో నిలబెడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురి అవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి విద్యార్థుల కష్టాలను పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పాటిస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ కూడా చేయకపోవడం విచారకరం. జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాల యాజమాన్యం పూర్తిగా బరితెగిస్తే విద్యాశాఖ అధికారులు ,జిల్లా అధికారులకు అడిగినప్పుడు సహాయం చేస్తున్నామని, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పాఠశాల గదులు ఇస్తున్నాం మా ఇష్టం వచ్చినట్లు ఫీజులను వసూలు చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే విద్యార్థుల తల్లిదండ్రుల పై విరుచుకుపడుతున్నారు. మొత్తం ఫీజులను చెల్లిస్తేనే పరీక్షలు రాయాలి ఇస్తామని లేదంటే మీ ఇష్టం అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల ఫీజులుం అడ్డుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Next Story