- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బల్దియాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య రచ్చకొనసాగుతూనే ఉంది. పోటాపోటిగా ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మాపై దౌర్జన్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. మాకే ధమ్కీ ఇచ్చారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎదురు దాడి చేశారు. అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య గొడవలు గ్రేటర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మేయర్ క్షమాపణలు చెప్పాలి..
కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను అక్రమంగా అరెస్టు చేశారని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్ల పై కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్‌లో తమ పై దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. మేయర్ విజయలక్ష్మి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌ను ఆమె ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు. బడ్జెట్ పై కౌన్సిల్‌లో చర్చించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎలా బడ్జెట్ ఆమోదించారంటూ ప్రశ్నించారు. మేయర్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
రౌడీల్లా వ్యవహరించారు : కాంగ్రెస్ కార్పొరేటర్లు..
కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న సంఘటనలు, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆరోపణలు, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ధర్నా నేపథ్యంలో మేయర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలు, కౌన్సిల్ మీటింగ్‌లో జరిగిన అంశాల పై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్‌లో తమకు ధమ్కీ ఇచ్చారని కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, మహాలక్ష్మిగౌడ్, సుజాత అన్నారు. సభను, మేయర్‌ను లెక్కచేయకుండా రౌడీల్లా బిహేవ్ చేశారని మండిపడ్డారు. వాళ్ల అధిష్టానం మెప్పు కోసం ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారని అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల పై కాంగ్రెస్ కార్పొరేటర్లు అనుచితంగా ప్రవర్తించారనడంలో వాస్తవంలేదన్నారు. హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పక్కనబెట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తమ కార్పొరేటర్ల చెంప పగులగొడుతామని బెదిరించారని తెలిపారు.
బీఆర్ఎస్ అధిష్టానం స్క్రిప్ట్ ప్రకారమే కౌన్సిల్‌లో రౌడీల్లాగా ప్రవర్తించారని తెలిపారు. కౌన్సిల్‌లో బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్ల చీరలు లాగారనడం సిగ్గుచేటన్నారు. అనవసరంగా ఆరోపణలు చేసి మహిళల పరువు తీయొద్దని సూచించారు. సీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న సభను రాష్ట్రమంతా చూసిందన్నారు. ప్రజాధనం వెచ్చించి నిర్వహించిన సభలో ప్రజా సమస్యలు చర్చించాలి కానీ గుండాల్లగా ప్రవర్తించకూడదన్నారు. మేయర్‌ను హైదరాబాద్ ప్రజలను బీఆర్ఎస్ సభ్యులు అవమానించారన్నారు. ఉద్యమం చేసిన వారిని పక్కనబెట్టి.. బయటి వారిని తీసుకొచ్చి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. బాబా ఫసియోద్దీన్ మాట్లాడుతూ.. తనపై మహిళలు దాడి చేశారని, ఉస్మానియా హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. తనపై జరిగిన దాడి పై పోలీసులు విచారణ చేయాలన్నారు. వేరే పార్టీలో ఉన్న విగ్గు తలసాని, గంట కొట్టే మాగంటి, మల్లారెడ్డిలను తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారని, బీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులు తనకు ఫోన్ చేసి పరామర్శించారన్నారు.
నాయకుడుల్లేక నారాజు..
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో లీడ్ చేసే నాయకుడు కరువయ్యారు. మహిళా కార్పొరేటర్లు గట్టిగానే పోరాడారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నా ప్రేక్షక పాత్ర వహించారు తప్ప వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదు. బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ చెప్పినట్టుగా చేయడంతో మేయర్ తీరుపై గట్టిగానే ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై మేయర్‌ను నిలదీశారు. ఇక మజ్లిస్ పార్టీ సభ్యులు మాత్రం వాళ్ల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే పనిచేశారు. శానిటేషన్, వీధిదీపాల నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యులను మేయర్ కంట్రోల్ చేశారు.