- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాత భవనం పై కొత్తనిర్మాణాలు..
దిశ, శేరిలింగంపల్లి : గత ఏడాది పట్టణ ప్రగతిలో భాగంగా కాలం చెల్లిన కట్టడాలను, కూలేందుకు సిద్ధంగా నిర్మాణాలను నేలమట్టం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పాత భవనాల యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో మరోసారి అలాంటి చర్యలకు సిద్ధమవుతోంది జీహెచ్ఎంసీ. కానీ శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో ఏళ్లనాటి పాత భవనాల పై కొత్తగా చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవడంలో మాత్రం మీనమేషాలు లెక్కబెడుతున్నారు ఉన్నతాధికారులు.
ఓవైపు కాలం చెల్లిన నిర్మాణాలను కూలుస్తామంటూ నోటీసులు ఇస్తున్న అధికారులు, ఏళ్ల నాటి భవనాల పై ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్న కొత్త నిర్మాణాలపట్ల ఉదాసీనత ఎందుకన్నది శేష ప్రశ్నే. ఇలాంటి నిర్మాణాల పై చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా శేరిలింగంపల్లి జోన్ లోని ఆయా సర్కిళ్లలో ఉన్నతాధికారులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. పాత నిర్మాణాల పై కొత్తగా అంతస్థుల మీద అంతస్తులు వేయడమే కాదు వాటిని కమర్షియల్ అవసరాలకు, స్కూళ్లు కాలేజీలు నడిపేందుకు కిరాయిలకు ఇస్తున్నారు. పిల్లల భవిష్యత్తును, ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని విద్యా సంస్థలు అలాంటి పాత భవనాలపై కొత్త అంతస్తులు వేయించి వ్యాపారం చేస్తున్నాయి.
పాతభవనాల పై కొత్తగా కట్టడాలు..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొత్తగా వందలాది నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిలో పర్మిషన్లు ఉన్నవి, లేనివి అంటూ చాలా ఉన్నాయి. కానీ ఇదే తరహాలో పాతభవనాల పై కొత్తగా నిర్మాణాలు చేపట్టడం ఈ మధ్య కాలంలో ఊపందుకున్నాయి. ఒకటో రెండో కాదు ఇలా పాత భవనాల పై కొత్తగా సాగే నిర్మాణాలు పదుల సంఖ్యలో ఉండడం విశేషం. ఇది ఏదో ఒక్క డివిజన్ కు మాత్రమే పరిమితం కాలేదు. అన్ని డివిజన్లలోనూ ఇదే వరుస. పది పదిహేను సంవత్సరాల క్రితం, కొందరైతే అంతకుముందు ఒకటో రెండో అంతస్థుల కట్టుకున్నావారు తాజాగా అదే పాత భవనాల పై అంతస్థుల మీద అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే, నిర్మాణ స్థలం ఎంత, అక్కడ సాయిల్ ఏ విధంగా ఉంటుంది. సదరు నిర్మాణం ఎంతకాలం మన్నికగా ఉంటుంది, స్థల విస్తీర్ణాన్ని బట్టి దానికి అనుగుణంగా పర్మిషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులు పర్మిషన్లు పక్కన బెట్టి, నిబంధనలు బేఖాతరు చేస్తూ పాత భవనాల పై తాజాగా అంతస్థుల మీద అంతస్తులు కట్టేస్తున్నారు.
అంతా నిమిత్త మాత్రులే..
పాత కట్టడాల పై కొత్తగా చేపడుతున్న బహుళ అంతస్థుల నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారుల వద్ద ఎలాంటి సమాచారం ఉండడం లేదు. పలుచోట్ల జరుగుతున్న నిర్మాణాల పై అధికారులను సంప్రదించినా తమకు తెలియదంటున్నారు. నిర్మాణదారులు ఎవరికివారు కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు ఈ లీడర్ తెలుసు, ఆ నాయకుడు చెప్పాడంటూ జీహెచ్ఎంసీ సిబ్బంది పై ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయని కిందిస్థాయి అధికారులు వాపోతున్నారు. ఎవరిని ఆపమన్నా తామే బలిపశువులం అవుతున్నామని, ఒక్కో నిర్మాణదారు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఓ కిందిస్థాయి సిబ్బంది వాపోయాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించడం లేదని తాము మాత్రం ఏం చేయగలం అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పాత భవనాల పై కొత్తగా సాగుతున్న నిర్మాణాల విషయంలో తాము నిమిత్తమాత్రులమేనని ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే తప్పా వాటిని ఆపలేమని చేతులెత్తేస్తున్నారు.
కట్టడాలు ఆగేనా..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని జంట సర్కిళ్లలో పాత భవనాల పై కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు పాత భవనాలను, కాలం చెల్లిన కట్టడాలను కూలుస్తున్న అధికారులు పాత భవనాల పై సాగుతున్న కట్టడాలను ఉపేక్షించడంపట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాత భవనాల పై కొత్తగా చేపట్టిన నిర్మాణాల్లో విద్యా సంస్థలు నడపడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి నిర్మాణాలను వెంటనే ఆపాలని, భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలు జరగకముందే మేల్కొంటే మంచిదని, తీరా ప్రమాదాలు జరిగాక హడావుడి చేస్తే ప్రయోజనం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.