మియాపూర్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?

by Sumithra |
మియాపూర్ కేంద్రంగా కొత్త నియోజకవర్గం..?
X

దిశ, శేరిలింగంపల్లి : నియోజవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తుంది. భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నందున తమకు అవకాశాలు మెరుగవుతాయని ఆశలు పెట్టుకుంటున్నారు. 2026 లో జనగణన సర్వే జరగనున్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ అంశం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లిలో ఎన్ని నియోజకవర్గాలు కానున్నాయి అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది.

పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మరో రెండు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ పునర్విభజన తప్పకుండా జరిగనుంది అనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేడు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎలా విజభజిస్తారు.? ఏఏ డివిజన్లు ఎక్కడెక్కడ ఉంటాయి.? కొత్త నియోజకవర్గం పేరు ఎలా ఉండనుంది.? అనేదానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

7 లక్షలు దాటిన శేరిలింగంపల్లి ఓటర్లు..

మినీ ఇండియాగా పేరున్న శేరిలింగంపల్లి ఓటర్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటరు జాబితాలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 7,32,506 కు చేరింది. గతంలో ఈ సంఖ్య 7 లక్షలకు దగ్గరగా ఉండగా తాజాగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లను ఈ జాబితాలో చేర్చారు. దీంతో ఈ సంఖ్య 7 లక్షల 32 వేలు దాటింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లి ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత ఉద్యోగులకు నిలయంగా మారింది. వలస కూలీలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 7,32,506 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,88,482, మహిళ ఓటర్లు 3,43,875 ఇతరులు 149 మంది ఉన్నారు. వికలాంగులు 5,407 మంది ఓటర్లుగా నమోదు అవగా వారిలో పురుషులు 3,067, మహిళలు 2,340 మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 8,102 మంది ఉండగా అందులో పురుషులు 4,518, మహిళలు 3,582, ఇతరులు ఇద్దరు ఉన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ ఓటర్లు 27 మంది ఉండగా మహిళలు ఏడుగురు, పురుషులు 20 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 54 మంది ఉండగా పురుషులు 44 మంది, మహిళలు 10 మంది ఉన్నారు.

రెండుగా విడిపోనున్న శేరిలింగంపల్లి..?

రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న శేరిలింగంపల్లి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో విస్తరించి ఉంది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, మియాపూర్, హైదర్ నగర్, వివేకానంద నగర్, అల్వీన్ కాలనీలతో పాటు అటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్ పల్లిలోని కొంత భాగం ఇటు సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్ లోని కొంత భాగం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇంత పెద్ద నియోజకవర్గం.. 2026 జనగణనలో రెండు భాగాలుగా విడిపోనున్నట్లు స్పష్టమవుతుంది. అయితే ఆ విభజన ఎలా ఉండబోతుంది అనేదాని పై అనేక చర్చలు సాగుతున్నాయి. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హాఫీజ్ పేట్, చందానగర్ డివిజన్లు కలుపుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంగా ఉండనున్నట్లు ప్రాథమిక అంచనా.. ఇక రెండవ నియోజకవర్గంగా మియాపూర్, హైదర్ నగర్, వివేకానంద నగర్, అల్వీన్ కాలనీలను కలుపుతూ మియాపూర్ పేరుతో రెండవ నియోజకవర్గంగా విడిపోనున్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గ పునర్విభజనలో ఏ జిల్లాల పరిధిలోకి అదే జిల్లాలోని డివిజన్లు ఉండేలా సర్దుబాటు చేస్తారని రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆశావాహుల లెక్కలు.. !

2026 లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండనుందని రాజకీయ నాయకులు, ఆశావహులు ఇప్పటి నుండే ఎవరికి వారుగా లెక్కలేసుకుంటున్నారు. కొత్త నియోజకవర్గాలో తమకు అవకాశాలు ఉంటాయని అన్ని పార్టీల నాయకులు ఆశలు పెట్టుకుంటున్నారు. పునర్విభజనతో పాటు రిజర్వేషన్లు కూడా మారే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాలు ఎలా కలిసి వస్తాయి అనే దానిపై ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నట్లు స్పష్టం అవుతుండగా ఇప్పటి నుండే గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారట కొందరు రాజకీయ నాయకులు. ఇదే తరుణంలో ఆయా పార్టీల్లోని ముఖ్యమైన లీడర్లు తాము ఏ పార్టీలో ఉంటే సేఫ్, ఏ పార్టీని ప్రజలు ఆదరించే ఛాన్స్ ఉంది అనే కోణంలోనూ ఇప్పటి నుండే అంచనాలు వేసేసుకుంటున్నారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన కోసం వారెంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మహిళలకు ఛాన్స్..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి 50 శాతం మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలు అయితే మహిళలకు రాజకీయంగా అవకాశాలు దక్కనున్నాయి. అయితే ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి మహిళా నాయకులు ఎవరున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. కార్పొరేటర్లుగా చేసిన వారు, చేస్తున్నవారు, బరిలో ఉన్నవారు ఉన్నా.. వారికి భవిష్యత్తులోనూ అదే స్థాయి ప్రోత్సాహం ఉంటుందా..? ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభిస్తాయా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ సరైన అవకాశాలు ఉంటే తమ సతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు చాలామంది పతులు సిద్ధంగానే ఉన్నారనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed