ప్రధాని మోడీలా నా కొడుకు డిగ్రీ సర్టిఫికెట్ ఫేక్ కాదు : రోహిత్ వేముల తల్లి రాధికమ్మ

by Disha Web Desk 11 |
ప్రధాని మోడీలా నా కొడుకు డిగ్రీ సర్టిఫికెట్ ఫేక్ కాదు : రోహిత్ వేముల తల్లి రాధికమ్మ
X

దిశ, శేరిలింగంపల్లి : నా కొడుకుది మోడీ లాంటి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ కాదని, రోహిత్ వేముల జేఆర్ఎఫ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని, పీహెచ్ డీలో జనరల్ సీట్ సాధించాడని రోహిత్ వేముల తల్లి రాధికమ్మ అన్నారు. హెచ్ సీయూ పూర్వ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై శుక్రవారం కోర్టుకు పోలీసులు సమర్పించిన తుది నివేదికపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ సీయూ మెయిన్ గెట్ వద్ద విద్యార్థి సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేములను ప్రస్తుతం పోలీసులు మరోసారి చంపారని, తప్పుడు నివేదికలు ఇచ్చి బీజేపీకి అనుకూలంగా రోహిత్ వేముల మరణాన్ని మార్చారని దుయ్యబట్టారు. నేను దళితురాలినని, నా కొడుకు ముమ్మాటికి దళితుడని రాధికమ్మ స్పష్టం చేశారు. నా కొడుకు చదువులో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, అతను చదువుల ఒత్తిడితో మరణించాడని పోలీసులు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికెట్ లాగా నా కుమారుడిది దొంగ డిగ్రీ సర్టిఫికెట్ కాదని, నా బిడ్డలు ఇద్దరూ చదువుల్లో జెమ్స్ అని రాధికమ్మ అన్నారు. బీజేపీ నాయకులకు వత్తాసు పలుకుతూ అప్పటి పోలీసులు రిపోర్ట్ రెడీ చేశారని, 60 పేజీల నివేదికలో పోలీసులు రోహిత్ దళితుడు కాదని నిరూపించేందుకు 30 పేజీలను కేటాయించారని, ఇంతకన్నా ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. రోహిత్ వేముల మరణంపై నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతానని, ఈ కోర్టుకు కాకుంటే ఆ పై కోర్టుకు వెళ్లి పోరాడుతానని, రోహిత్ వేముల మరణానికి కారణమైన నాటి వీసీ అప్పారావుకు, బీజేపీ నాయకులకు శిక్ష పడేంత వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రోహిత్ వేముల మరణంపై మరోసారి దర్యాప్తు చేయాలని కోరామని, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, తిరిగి దర్యాప్తు జరపనున్నట్లు హామీ ఇచ్చారని రాధికమ్మ వెల్లడించారు.

ముమ్మాటికి పోలీసులది తప్పుడు నివేదికే : విద్యార్థి సంఘాల నాయకులు

రోహిత్ వేముల మరణంపై, కులంపై పోలీసులు ఇచ్చిన నివేదిక ముమ్మాటికి తప్పుడు నివేదిక అని హెచ్ సీయూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. రోహిత్ వేముల మరణానికి సంబంధించి పోలీసుల నివేదికపై హెచ్ సీయూ గేట్ వద్ద విద్యార్థులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోహిత్ ది సంస్థాగత హత్యని, నాటి వీసీ అప్పారావు, నాటి ఎమ్మెల్సీ రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ లే రోహిత్ వేముల మరణానికి కారణమని వారు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కూడా రోహిత్ వేముల నిజమైన దళితుడని ధృవీకరించారని, కావాలంటే స్వతంత్ర దర్యాప్తుకు మేము స్వాగతిస్తున్నామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Next Story

Most Viewed