నాపై దాడి చేసిన వారిని అస్సలు వదిలిపెట్టను : ప్రధానార్చకులు రంగరాజన్

by Sumithra |
నాపై దాడి చేసిన వారిని అస్సలు వదిలిపెట్టను : ప్రధానార్చకులు రంగరాజన్
X

దిశ, ఖైరతాబాద్ : అకారణంగా తనపై దాడి చేసి కొట్టి, అవమానించిన నిందితులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు రంగరాజన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6న కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చి అలసిపోయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానన్నారు. మరుసటి రోజు అంటే 7న 20 మంది దుండగులు తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి రామరాజ్య స్థాపనకు తమకు సహకరించాలని కోరారన్నారు. అసలు వారి ఉద్దేశ్యమేమిటో అడిగానని, దీంతో కోపంతో తనపై దాడి చేసి కొట్టారన్నారు. భుజం పై నామాలున్న చోట తన్నారని, వీడియో రికార్డు చేసి తనను బెదిరించారన్నారు. తమ తర్వాత టార్గెట్ చిన్నజీయరు స్వామి అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారన్నారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డితో పాటు పలువురిని అరెస్టు చేశారని తెలిపారు.

ప్రస్తుతం బెయిల్పై వచ్చిన వీరరాఘవ రెడ్డి పలు ప్రైవేట్ యూట్యూబ్ చానెళ్లలో తన పై అసత్యపు ఆరోణలు చేస్తున్నాడన్నారు. తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు తన పరువుకు భంగం వాటిల్లేలా బహిరంగంగా మాట్లాడుతున్నాడన్నారు. అతని వ్యాఖ్యల పై న్యాయం పోరాటం చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానన్నారు తనపై దాడి చేసిన రోజు ఒక్క ఫోన్ చేస్తే వారు చిలుకూరు దాటే వారు కాదని, కాని తాను అలా చేయలేదని, న్యాయపరంగానే వారిని ఎదుర్కొనేందుకు పోలీసులను ఆశ్రయించానన్నారు. వారికి శిక్షపడే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎం.మోహన్, నగర ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ దళితులకు దేవాలయం ప్రవేశం చేయించినందుకే కొందరు అగ్రవర్ణం పెద్దలు ఓర్వలేకనే ఆయన పై ఇలాంటి దాడులు చేయించారన్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తూ రంగరాజన్ పరువుకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తే సరైన జవాబు చెబుతామన్నారు.



Next Story

Most Viewed