- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రేడ్ లైసెన్స్ ఆదాయంపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్

దిశ, సిటీ బ్యూరో: ఆస్తిపన్ను తో పాటు ట్రేడ్ లైసెన్స్ ద్వారా వచ్చే ఆదాయం పై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రూ.150 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 2.50 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉంటే సగం సంస్థలే ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. ప్రతి వ్యాపార సంస్థ లైసెన్స్ తీసుకునే విధంగా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.
నేటి నుంచి 25 శాతం పెనాల్టీ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి జనవరి 31తో ఉచితంగా రెన్యువల్ చేసే గడువు ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి రెన్యూవల్ చేసుకోనున్న ట్రేడ్ లైసెన్స్‌లపై ఫీజులో 25 శాతాన్ని పెనాల్టీ వేయనున్నారు. మార్చి ప్రారంభం నుంచి నెలాఖరు వరకు 50 శాతం జరిమానాగా వసూలు చేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి రెన్యువల్ చేసుకునే వ్యాపారుల నుంచి చెల్లించాల్సిన ట్రేడ్ ఫీజులో వంద శాతం జరిమానా వసూలు చేయనున్నారు.
జనవరి నుంచి డిసెంబర్..
జీహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు ఆర్థిక సంవత్సరంగా అమలు చేస్తుండగా, ట్రేడ్ లైసెన్స్‌లకు మాత్రం జనవరి నుంచి డిసెంబర్ వరకు అమలు చేయనున్నారు. ఒక్క డిసెంబర్‌లోనే ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ.2 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్న జీహెచ్ఎంసీ జనవరి 1 నుంచి 31 సాయంత్రం వరకు రూ.65 కోట్లతో మొత్తం రూ.67.13 కోట్ల ఫీజు వసూలైంది. ట్రేడ్ లైసెన్స్‌లు కొత్తవి జారీచేయడంతో పాటు పాతవాటిని రెన్యూవల్ చేయడానికి రూ.150 కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరిలోనే రూ.67.13 కోట్లు వసూలు చేసుకోగా, మిగిలిన రూ.82.83 కోట్లను డిసెంబర్ నెలాఖరు కల్లా వసూలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ప్రతి రోజూ 20 సంస్థలు..
మెడికల్ ఆఫీసర్, లైసెన్సింగ్ ఆఫీసర్ ప్రతిరోజు కనీసం 20 వ్యాపార సంస్థలను నేరుగా కలిసి, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్‌కు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా అందజేయాలని కమిషనర్ నిర్ణయించడంతో మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ట్రేడ్ లైసెన్స్‌లు 2.49 లక్షలు..
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో కలిపి సుమారు 2.49 లక్షల వరకు ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గోషామహల్ సర్కిల్‌లోనే సుమారు 35 వేలు ఉన్నాయి. కానీ 2.49 లక్షల లైసెన్స్‌లు ఉన్నా, జనవరిలోనే జీహెచ్ఎంసీ సుమారు లక్షా పది వేల ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ.67.13 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. మిగిలిన లక్షా 39 వేల ట్రేడ్ లైసెన్స్‌లలో చాలా వరకు మూతపడ్డ వ్యాపార సంస్థలున్నట్టు అధికారులు గుర్తించారు. అలాంటి వాటి వివరాలను ట్రేడ్ లైసెన్స్ జాబితా నుంచి తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సంస్థలను మాత్రమే గుర్తించడానికి మెడికల్ ఆఫీసర్లు, లైసెన్సింగ్ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నెల రోజుల్లో లైవ్ ట్రేడ్ లైసెన్స్‌లు, డెడ్ ట్రేడ్ లైసెన్స్ వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.