గల్లీ మే గాళీ.. ఢిల్లీ మే డోలి: బూర నర్సయ్య గౌడ్ సెటైర్లు

by srinivas |
గల్లీ మే గాళీ.. ఢిల్లీ మే డోలి: బూర నర్సయ్య గౌడ్ సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గల్లీ మే గాళీ.. ఢిల్లీ మే డోలి అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందని ఆయన విమర్శలు చేశారు. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందని పేర్కొన్నారు. గల్లీలో తిట్లు.., ఢిల్లీలో మెట్లు.., దేవుళ్లపై ఒట్లు పెట్టడం వరకే సర్కార్ పరిమితమైందని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు ఏడాదిలో 24 సార్లు ఢిల్లీకి వెళ్లి రికార్డు సృష్టించారని చురకలంటించారు.

ప్రధాని మోడీ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చాలని రూ.లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించారని పేర్కొన్నారు. మోసపోతే గోసపడుతామని ఎన్నికలకు ముందే బీజేపీ చెప్పిందని, బీజేపీ తెలంగాణలో అధికారంలో ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా అంతా తామే అభివృద్ధి చేశామని కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటోందని బూర నర్సయ్య ధ్వజమెత్తారు. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికీ అధికారం బీజేపీదేనని నొక్కి చెప్పారు. అందరూ బీజేపీ అసలు పోరాటాలు చేయడంలేదని భావిస్తున్నారని, ప్రస్తుతం బీజేపీలో సభా పర్వం, సభ్యత్వ పర్వం, సంఘటన పర్వం నడుస్తోందని, సంగ్రామ పర్వం త్వరలో మొదలవుతుందని ధీమా వ్యక్తంచేశారు. అసలు బీజేపీకి ఫైర్ లేదని కొందరు అంటున్నారని, త్వరలో వైల్డ్ ఫైర్ చూస్తారన్నారు. తగ్గేదెలే.. అన్నట్లుగా కలిసి పని చేస్తామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed